Chance for Avesh Khan: వన్డేలు, టీ20ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యువ బౌలర్ అవేశ్ ఖాన్‌కు టెస్టుల్లోకి పిలుపొచ్చింది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు కోసం సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ స్థానంలో జట్టులోకి అవేశ్‌ఖాన్ ఎంపికయ్యాడు. టెస్టు సిరీస్ కోసం ఫిట్‌నెస్ సాధించని మహమ్మద్ షమీ స్థానంలో ఇప్పటిదాకా ఎవరినీ ఎంపిక చేయలేదు. ఇప్పుడు కేప్‌టౌన్ వేదికగా జరగనున్న రెండో టెస్టు కోసం షమీ స్థానంలో అవేశ్‌కు చోటు కల్పించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలిటెస్టులో ఘోరంగా ఓడిన భారత్ రెండు టెస్టుల సిరీస్‌లో 0-1తో వెనకబడి ఉంది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జనవరి 3 నుంచి ఆరంభంకానుంది. మరోవైపు వెన్ను నొప్పి కారణంగా తొలి టెస్టుకు దూరమైన భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రెండో టెస్టుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండో టెస్టులో ఆడేందుకు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. రెండో టెస్టులో జడేజా ఆడితే.. బ్యాటర్‌గానూ రెండో స్పిన్నర్‌గానూ జట్టుకు ఉపయోగపడతాడు. తొలిటెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ప్రసిద్ధకృష్ణ, శార్దూల్ ఠాకూర్ స్థానంలో అవేశ్‌ఖాన్, రవీంద్ర జడేజా తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
తొలిటెస్టులో ఘోర పరాజయం
సెంచూరియన్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. విరాట్ కోహ్లీ పోరాడినా టీమిండియాకు పరాజయం తప్పలేదు. దక్షిణాఫ్రికా పేసర్ల నిప్పులు చెరిగే బంతులకు భారత బ్యాటర్ల దగ్గర సమాధానమే కరువైంది. సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటై 163 పరుగుల ఆధిక్యాన్ని సాధించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. సౌతాఫ్రికా పేసర్లు చెలరేగడంతో 131 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ (76) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. శుభ్‌మన్ గిల్ 26 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లలందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.
సచిన్ విశ్లేషణ ఇదే..
టీమ్‌ఇండియా బ్యాటర్ల షాట్ల ఎంపిక సరిగ్గా లేదని క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ విశ్లేషించాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా మారినట్లు అనిపించిన పిచ్‌పై భారత్‌ను కట్టడి చేయడం అద్భుతమేనని అన్నాడు. తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా కాస్త అసంతృప్తికి లోనై ఉంటుందని భావించానని... కానీ రెండో ఇన్నింగ్స్‌కు వచ్చేనాటికి వారి బౌలింగ్ మరింత పదునుదేలిందని అన్నాడు. డీన్ ఎల్గర్, జాన్‌సెన్, బెడింగ్‌హామ్ ప్రొటీస్ విజయంలో కీలకపాత్ర పోషించారని సచిన్ అన్నాడు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మాత్రమే భారత్ తరఫున కీలక ఇన్నింగ్స్‌లు ఆడారని వారి నాణ్యమైన టెక్నిక్‌తో కఠినమైన పిచ్‌పై కూడా పరుగులు రాబట్టారన్నాడు. చివరికి దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడి విజయం సాధించింద సచిన్ ట్వీట్ చేశాడు.
ఓడినా కోహ్లీ కొత్త చరిత్ర...
కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 38, రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏడు క్యాలెండర్ సంవత్సరాల్లో 2000 వేలకుపైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా అవతరించాడు. అధికారికంగా 1877 నుంచి క్రికెట్ గణాంకాలను లెక్కలోకి తీసుకుంటే మరే ఇతర బ్యాటర్ ఈ ఘనత సాధించలేదు. కోహ్లీ 2012లో 2,186 పరుగులు, 2014లో 2,286 పరుగులు, 2106లో 2,595 పరుగులు, 2017లో 2,818 పరుగులు, 2017లో 2,735 పరుగులు, 2019లో 2,455 పరుగులు చేయగా..ఇప్పుడు ఈ ఏడాదిలో 2,006 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టే ఈ సంవత్సరం భారత్ ఆడిన చివరి మ్యాచ్ కావడం విశేషం.