Duleep Trophy 2023 Winner: దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీని సౌత్ జోన్ సొంతం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన వెస్ట్ జోన్‌ను ఓడించి.. 2010 తర్వాత ఈ ట్రోఫీని తిరిగి దక్కించుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం ముగిసిన ఫైనల్‌లో సౌత్ జోన్.. 75 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
రెండో ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ నిర్దేశించిన 298 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన వెస్ట్ జోన్.. 222 పరుగులకే ఆలౌట్ అయింది. వెస్ట్ జోన్ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ (211 బంతుల్లో 95, 11 ఫోర్లు, సర్ఫరాజ్ ఖాన్ (76 బంతుల్లో 48, 5 ఫోర్లు, 1 సిక్స్)లు పోరాడినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. టీమిండియా స్టార్ బ్యాటర్లు ఛతేశ్వర్ పుజారా (15), సూర్యకుమార్ యాదవ్ (4) లు విఫలమయ్యారు.
తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్.. 78.4 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ హనుమా విహారి (63)తో పాటు మరో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ (40) రాణించారు. అయితే వెస్ట్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌట్ అయింది. పృథ్వీ షా (65) రాణించాడు. సౌత్ జోన్ బౌర్లలో విధ్వత్ కావేరప్ప.. ఏడు వికెట్లతో వెస్ట్ జోన్ ఇన్నింగ్స్‌ను కకావికలం చేశాడు.
67 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన సౌత్ జోన్ బ్యాటర్లు మరోసారి విఫలం కావడంతో 230 పరుగులకే ఆలౌట్ అయింది. హనుమా విహారి (42) మరోసారి ఆపద్బాంధవుడి పాత్రను పోషించగా.. వాషింగ్టన్ సుందర్ (37), సచిన్ బేబీ (37) లు కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం 298 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్ట్ జోన్‌కు ఆది నుంచే కష్టాలు మొదలయ్యాయి. పృథ్వీ షా (7), ఛతేశ్వర్ పుజారా, సూర్యకుమార్ యాదవ్‌లు విఫలయమ్యారు. సౌత్ జోన్ బౌలర్లలో కౌశిక్, సాయి కిషోర్‌లు తలా నాలుగు వికెట్లతో చెలరేగగా కావేరప్ప, వైశాఖ్‌లు చెరో వికెట్ తీశారు.
కాగా 2010-11 సీజన్ తర్వాత సౌత్ జోన్‌కు ఇదే ఫస్ట్ దులీప్ ట్రోఫీ. 2013-14 సీజన్‌లో సౌత్ జోన్ - నార్త్ జోన్‌లు సంయుక్తంగా విజేతగా నిలిచాయి. సౌత్ జోన్‌కు ఇది 12వ దులీప్ ట్రోఫీ టైటిల్.