Yuzvendra Chahal About RCB: ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ యుజ్వేంద్ర చాహల్ తన మాజీ ఫ్రాంచైజీ, 2022 వేలంలో తనను పట్టించుకోని ఆర్సీబీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ మేనేజ్‌మెంట్ చేసిన పనికి తనకు చాలా కోపం వచ్చిందని.. 8 ఏండ్లు ఆ ఫ్రాంచైజీ తరఫున ఆడితే కనీసం తనను ఎందుకు రిటైన్ చేసుకోలేదో కూడా చెప్పలేదని  వాపోయాడు.  ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అలహబాదియాతో నిర్వహించిన  పోడ్‌కాస్ట్‌లో చాహల్ ఆర్సీబీపై ఆసక్తికర వ్యాఖ్యలు  చేశాడు. 


ఒక కుటుంబంలా భావించా... 
ఆర్సీబీ తనను రిటైన్ చేసుకోకపోవడంపై చాహల్ స్పందిస్తూ.. ‘నన్ను రిటైన్ చేసుకోలేదనే విషయం తెలియగానే చాలా నిరుత్సాహపడ్డా. నా ప్రయాణం మొదలైందే ఆర్సీబీతో.  ఆర్సీబీతో నేను 8 ఏండ్లు ఆడా. ఆర్సీబీ నాకు  అవకాశాలిచ్చింది. అక్కడ నన్ను నేను నిరూపించుకోవడంతో  భారత జట్టులో కూడా అవకాశం దక్కింది.  నేను ఆడిన మొదటి మ్యాచ్ నుంచి కూడా విరాట్ కోహ్లీ భయ్యా నామీద చాలా నమ్మకంతో ఉండేవాడు. ఎనిమిదేండ్లు అది (ఆర్సీబీ) నాకు ఒక కుటుంబంలా మారింది. కానీ 2022 వేలానికి ముందు  నేను మేనేజ్‌మెంట్‌ను ఎక్కువ డబ్బులు అడిగానని  నాపై విమర్శలు వచ్చాయి. ఆ వార్తలను నేను కూడా చదివి తర్వాత  పలు ఇంటర్వ్యూలలో క్లారిటీ ఇచ్చా. నన్ను ఇప్పటికీ బాధించేదేంటంటే.. అసలు నన్ను ఎందుకు రిటైన్  చేసుకోలేదనే విషయంపై ఇప్పటివరకూ నాకు ఆర్సీబీ నుంచి కనీసం ఫోన్ ద్వారా కూడా వివరణ రాలేదు.. అది నన్ను చాలా బాధించింది..’అని  అన్నాడు.


కోపమొచ్చింది..  
ఇదే ఇంటర్వ్యూలో చాహల్ మాట్లాడుతూ.. ‘ఆర్సీబీ తరఫున నేను సుమారు 140 మ్యాచ్‌లు ఆడాను.  కానీ ఉన్నఫళంగా   నన్ను రిటైన్ చేసుకోవడం లేదనేసరికి నాకు ఏమీ అర్థం కాలేదు. రిటైన్ చేసుకోకపోయినా  నన్ను వేలంలో దక్కించుకుంటామని  ఆర్సీబీ మేనేజ్‌మెంట్ నాకు ప్రామిస్ చేసింది.  కానీ వేలంలో నా తరఫున ఒక్క బిడ్ కూడా వేయలేదు. అది నన్ను చాలా నిరుత్సాహపరిచింది. దాంతో ఆర్సీబీపై కోపమొచ్చింది. 8 ఏండ్లు ఆ జట్టు కోసం నేను  చేయాల్సిందంతా చేశాను.  ఇప్పటికీ చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు) నా ఫేవరేట్ గ్రౌండ్. ఆ వేలం తర్వాత  ఆర్సీబీ - రాజస్తాన్ రాయల్స్ తలపడ్డ ఫస్ట్ మ్యాచ్‌లో నేను బెంగళూరు కోచ్‌లతో మాట్లాడలేదు...’అని  వ్యాఖ్యానించాడు. 


 






బెంగళూరు కంటే రాజస్తాన్‌లో బెటర్ అయ్యా.. 


ఆర్సీబీని వీడి  రాజస్తాన్‌తో కలిసినందుకు తనకు మంచే జరిగిందని  తన వ్యక్తిగత ప్రదర్శన కూడా  ఇంప్రూవ్ అయిందని చాహల్ చెప్పుకొచ్చాడు. ‘రాజస్తాన్ రాయల్స్‌లో చేరిన తర్వాత గతంలో కంటే నా ప్రదర్శన మెరుగుపడింది. నేను ఇక్కడ డెత్ బౌలర్‌గా ఎదిగాను. ఆర్సీబీలో ఉన్నప్పుడు నా ఓవర్ల కోటా  దాదాపు 16 లేదా 17 ఓవర్‌కే పూర్తయ్యేది.  కానీ రాజస్తాన్‌లో చేరాక నా  ప్రదర్శన 5 - 10 శాతం ఇంప్రూవ్ అయింది. అప్పుడు నేను.. ఏదైతే అది అయింది. అంతా మన మంచికే అనుకున్నా..  రాజస్తాన్ రాయల్స్ నాకు చాలా సపోర్ట్ చేస్తోంది..’ అని చాహల్ తెలిపాడు.






























Join Us on Telegram: https://t.me/abpdesamofficial