Asia Cup 2023: ‘ట్విస్టులు, ఝలక్‌లు, దెబ్బ మీద దెబ్బ.. ప్రతి సీను క్లైమాక్స్‌లా ఉంటది’ అన్న డైలాగ్‌ను గుర్తు చేస్తూ ఆసియా కప్ - 2023 నిర్వహణ వివాదం వాడీవేడీగా సాగుతోంది.  వివాదాలు సమసిపోయి ఇక షెడ్యూల్ విడుదలే తరువాయి అనుకున్న ప్రతీసారి ఈ  అంశంలో కొత్త మలుపులు ఎదురవుతున్నాయి.  ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకూ  జరుగబోయే ఈ మెగా టోర్నీలో నేడో రేపో షెడ్యూల్ కోసం వేచిచూస్తున్న  క్రికెట్ అభిమానులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరో ఝలక్ ఇచ్చింది. ఆతిథ్య  హక్కులు ఉన్న తమకు మరిన్ని మ్యాచ్‌లు కావాలని పట్టుబడుతోంది. 


నేడు  దుబాయ్ వేదికగా  ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఈ మీటింగ్‌లో తమకు  మరిన్ని మ్యాచ్‌లు కావాలని  పీసీబీ కోరనున్నట్టు తెలుస్తున్నది. హైబ్రిడ్ మోడల్‌లో జరుగబోయే ఈ  టోర్నీలో ఆతిథ్య హోదాలో ఉన్న తమకు నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఇచ్చి మిగిలిన  ప్రధాన మ్యాచ్‌లను  పాకిస్తాన్‌కు తరలించడం  సరికాదని పీసీబీ  కోరుతోంది. అదీగాక  ప్రస్తుతం శ్రీలంకలో  వానాకాలం సీజన్ కావడంతో  వర్షాలు మ్యాచ్‌లకు అంతరాయం కలిగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని,  తమకు అలాంటి ఇబ్బంది లేదని పీసీబీ  కొత్తవాదనను తెరపైకి తెచ్చింది.  గ్రూప్ స్టేజ్‌లో తాము ఆడబోయే మ్యాచ్‌లు అన్నీ పాకిస్తాన్ లోనే జరిగే విధంగా  అయినా  తమకు మ్యాచ్‌లను కల్పించాలని  కోరుతోంది. 


ఇదే విషయమై పీసీబీ  ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘శ్రీలంకలో వచ్చేది వానాకాలం. ఆసియా కప్ షెడ్యూల్ టైమ్‌లో అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ  నివేదికలు చెబుతున్నాయి.  అది టోర్నీకి కూడా మంచిది కాదు. ఆతిథ్య హక్కుదారుగా ఉన్న మాకు (పాకిస్తాన్)కు మరిన్ని మ్యాచ్‌లు కేటాయించాలని  ఆదివారం  దుబాయ్‌లో జరుగబోయే ఏసీసీ వార్షిక సమావేశంలో మేం కోరబోతున్నాం..’ అని తెలిపాడు. 


 






ఆది నుంచి అష్రఫ్‌ది అదే మాట.. 


పీసీబీ తాత్కాలిక  చీఫ్‌గా ఉన్న అష్రఫ్.. ఈ బాధ్యతలు స్వీకరించడానికంటే ముందే తాను హైబ్రిడ్ మోడల్‌కు పూర్తి వ్యతిరేకమని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.  ఆసియా కప్ హక్కులు కలిగి ఉన్న  పాకిస్తాన్‌కు నాలుగు మ్యాచ్‌లు ఇవ్వడం అవమానించడమేనని ఆయన వాపోయాడు. అయితే దీనిపై ఇదివరకే నిర్ణయం  తీసుకున్న నేపథ్యంలో తాను ఏం చేయలేనని, పాత కార్యవర్గం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని  వివరణ ఇచ్చాడు. కానీ పదిహేను రోజులు కూడా తిరకగముందే మళ్లీ కొత్త వివాదాన్ని సృష్టించాడు.  


ఇటీవలే  బీసీసీఐ సెక్రటరీ జై షా.. జకా అష్రఫ్‌ను కలిసినప్పుడు  ఆసియా కప్ షెడ్యూల్ గురించే చర్చించుకున్నారని, త్వరలోనే  ఆసియా కప్ పూర్తి షెడ్యూల్ విడుదల అవుతుందని  ఐపీఎల్ ఛైర్మన్ అరున్ ధుమాల్‌లు  డర్బన్ (దక్షిణాఫ్రికా)లో జరిగిన  ఐసీసీ వార్షిక సమావేశం సందర్భంగా వెల్లడించిన విషయం తెలిసిందే.  పాక్‌లో నాలుగు మ్యాచ్‌లు ఉంటాయని, మిగతా 9 మ్యాచ్‌లకు లంక ఆతిథ్యమిస్తుందని చెప్పిన ధుమాల్, భారత్ - పాక్ మ్యాచ్‌కు దంబుల్లాను వేదికగా ఎంపికచేసినట్టు వివరించాడు. వాస్తవానికి  అన్నీ  అనుకున్నట్టు జరిగితే  శుక్రవారం (జూన్ 14) విడుదల కావాల్సి ఉంది.  కానీ  పీసీబీ అడ్డుపుల్ల వేయడంతో  అది మళ్లీ ఆలస్యానికి దారితీసింది. దీనిపై నేడు దుబాయ్‌లో జరుగబోయే సమావేశంలో ఏసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని   క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





























Join Us on Telegram: https://t.me/abpdesamofficial