Wimbledon 2023 Final: సుమారు మూడు వారాలుగా టెన్నిస్ అభిమానులను అలరిస్తున్న వింబుల్డన్ తుది అంకానికి చేరుకుంది. నేడు ఈ  మెగా టోర్నీలో  పురుషుల సింగిల్స్ ఫైనల్స్ జరుగబోతుంది. అందరూ ఊహించినట్టుగానే   సెర్బియన్  సూపర్ స్టార్, పురుషుల  టెన్నిస్ ప్రపంచంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ (23) దక్కించుకున్న  నొవాక్ జకోవిచ్‌తో స్పానిష్ యువ సంచలనం భావి టెన్నిస్ తారగా ఎదుగుతున్న  కార్లొస్ అల్కరాస్ మధ్య ఫైనల్ జరుగనుంది. భారత కాలమానం ప్రకారం.. నేటి సాయంత్రం 6.30 గంటలకు ఈ మోస్ట్ ఎగ్జైటింగ్  గేమ్ చూసేందుకు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. 


మార్గరెట్‌ను సమం చేసేనా..? 


ఆధునిక టెన్నిస్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జకోవిచ్.. ఇప్పటికే పురుషుల సింగిల్స్ విభాగంలో  అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న ఆటగాడిగా ఉన్నాడు.  వింబుల్డన్ -2023 లో కూడా నెగ్గితే అతడు.. హయ్యస్ట్ గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన దిగ్గజ టెన్నిస్ తార మార్గరెట్ కోర్ట్ (24 టైటిల్స్)ను సమం చేస్తాడు.  ప్రస్తుతం జకోవిచ్.. సెరీనా విలియమ్స్  (23 టైటిల్స్)తో సమంగా ఉన్నాడు. 


వింబుల్డన్‌లో ఎదురేలేదు.. 


జకోవిచ్‌కు వింబుల్డన్ సెంటర్ కోర్టులో ఎదురేలేదు. 2018 నుంచి  అతడు ఇక్కడ ఫైనల్‌లో  ఓడింది లేదు. ఇది అతడికి  వరుసగా ఐదో ఫైనల్. 2013 నుంచి ఈ టోర్నీలో పది ఫైనల్స్ ఆడితే అందులో ఏడు టైటిల్స్ జకోవే.  తన కెరీర్‌లో 23 టైటిల్స్  నెగ్గిన జకోకు ఆస్ట్రేలియా ఓపెన్ (10) తర్వాత అత్యధికంగా వింబూల్డన్‌లో ఏడు  టైటిల్స్ గెలిచాడు. మరో టైటిల్ నెగ్గితే  అతడు  ఈ టోర్నీలో అత్యధిక టైటిల్స్ గెలిచిన రోజర్ ఫెదరర్ (8) సరసన  చేరుతాడు. 


 






అల్కరాస్‌తో అంత ఈజీ కాదు.. 


జకోతో పోలిస్తే అనుభవంలోనూ ఆటలోనూ అతడి స్థాయి కాకపోయినా అల్కరాస్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. 20 ఏండ్లకే  పురుషుల టెన్నిస్ నెంబర్ వన్ స్టార్ అయిన అల్కరాస్‌కు ఇది  రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్. గతేడాది యూఎస్ ఓపెన్ నెగ్గిన అల్కరాస్.. కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ వరకూ వెళ్లాడు. సెమీస్‌లో  ఇదే జకోవిచ్‌తో  ఓడాడు. తొలి రెండు రౌండ్ల తర్వాత  గాయం కారణంగా  అల్కరాస్ తడబడ్డాడు. ఆ మ్యాచ్‌లో ఓడినా గెలవాలని అతడు చూపిన తపన, గాయాన్ని సైతం లెక్కచేయకుండా  చేసిన పోరాటం స్వయంగా జకోవిచ్‌ను కూడా అబ్బురపరిచింది.  మ్యాచ్ ముగిసిన తర్వాత జకో.. ‘ఈ కుర్రాడికి మంచి భవిష్యత్ ఉంది’ అని మెచ్చుకున్న విషయం తెలిసిందే.  రోజురోజుకూ రాటుదేలుతున్న అల్కరాస్.. ఈ వింబూల్డన్‌లో కేవలం రెండు సెట్లు మాత్రమే కోల్పోవడం గమనార్హం.  మరోసారి కొండను ఢీకొనబోతున్న అల్కరాస్ నుంచి జకోకు గట్టిపోటీ అయితే ఎదురవడం పక్కా.. ఈ ఇరువురూ గతంలో రెండుసార్లు తలపడగా  చెరో మ్యాచ్ గెలుచుకున్నారు.  నేడు జరిగే ఫైనల్‌లో ఎవరు గెలిచినా అది చరిత్రే కానుంది.  మరి నేటి పోరులో విజేత ఎవరో తెలియాలంటే  రాత్రి వరకూ వేచి చూడాల్సిందే.


లైవ్ ఇలా.. 


ఈ మ్యాచ్‌ను లైవ్‌లో చూడాలంటే   స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్‌తో పాటు హాట్ స్టార్‌లో  వీక్షించొచ్చు.. 
























Join Us on Telegram: https://t.me/abpdesamofficial