MS Dhoni Dance: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ డ్యాన్స్ చేశాడు. స్నేహితులు, ఇతర క్రికెటర్లతో కలిసి దుబాయ్ లో పాటలకు కాలు కదుపుతూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది.
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకల కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ పార్టీలో ఇతర క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, ఇషాన్ కిషన్ లతో కలిసి డ్యాన్స్ చేశాడు. వైట్ షర్ట్ పైన బ్లాక్ సూట్ తో ధోనీ స్టైలిష్ గా కనిపించాడు. ప్రముఖ ర్యాపర్ బాద్ షా పాటలు పాడుతుంటే హార్దిక్, కృనాల్, ఇషాన్ లతో కలిసి మహి అదిరిపోయే స్టెప్పులు వేశాడు. దీనికి సంబంధించిన వీడియాలను ధోనీ భార్య సాక్షి సింగ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలకు వేలల్లో లైక్స్ వస్తున్నాయి.
అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ ప్రస్తుతం కుటుంబం, స్నేహితులతో విలువైన సమయాన్ని గడుపుతున్నాడు. అప్పుడప్పుడు వెకెషన్స్ కు వెళ్తూ సేదతీరుతున్నాడు. ఇకపోతే ధోనీ ఐపీఎల్ ఒక్కటే ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. హార్దిక్, ఇషాన్ కిషన్ లు న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ అనంతరం భారత్ కు తిరిగి వచ్చేశారు. వారిని కివీస్ తో వన్డేలకు ఎంపిక చేయలేదు.
గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతిష్ఠాత్మక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్ ను వీక్షించేందుకు అత్యధిక అభిమానులు హాజరైనందుకు బీసీసీఐకు ఈ అవార్డ్ లభించింది.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మే 29, 2022న గుజరాత్ టైటాన్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. దీన్ని చూసేందుకు 1,01,566 మంది అభిమానులు హాజరయ్యారు. ఇందుకుగాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో బీసీసీఐకు స్థానం దక్కింది. ఈ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో గెలుపొందిన హార్దిక్ పాండ్య నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ తన ఆరంభ సీజన్ లోనే ట్రోఫీ అందుకుంది.
1982లో అహ్మదాబాద్ లోని మొతెరా స్టేడియాన్ని నిర్మించారు. అప్పట్లో 49 వేల మంది కూర్చునే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం పునరుద్ధరించిన ఈ మైదానాన్ని ఫిబ్రవరి 2021లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్దది. లక్ష మందికి పైగా కూర్చుని వీక్షించే అవకాశం ఉంది.
గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించాక బీసీసీఐ కార్యదర్శి తన ఆనందాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ అవార్డు రావడానికి కారణమైన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. రికార్డు అందుకోవడం గర్వంగా ఉందన్నారు.