BCCI Guinness World Record: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతిష్ఠాత్మక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్ ను వీక్షించేందుకు అత్యధిక అభిమానులు హాజరైనందుకు బీసీసీఐకు ఈ అవార్డ్ లభించింది.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మే 29, 2022న గుజరాత్ టైటాన్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. దీన్ని చూసేందుకు 1,01,566 మంది అభిమానులు హాజరయ్యారు. ఇందుకుగాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో బీసీసీఐకు స్థానం దక్కింది. ఈ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో గెలుపొందిన హార్దిక్ పాండ్య నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ తన ఆరంభ సీజన్ లోనే ట్రోఫీ అందుకుంది.
1982లో అహ్మదాబాద్ లోని మొతెరా స్టేడియాన్ని నిర్మించారు. అప్పట్లో 49 వేల మంది కూర్చునే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం పునరుద్ధరించిన ఈ మైదానాన్ని ఫిబ్రవరి 2021లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్దది. లక్ష మందికి పైగా కూర్చుని వీక్షించే అవకాశం ఉంది.
గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించాక బీసీసీఐ కార్యదర్శి తన ఆనందాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ అవార్డు రావడానికి కారణమైన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. రికార్డు అందుకోవడం గర్వంగా ఉందన్నారు.
రమీజ్ రజా వ్యాఖ్యలపై క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందన
వచ్చే ఏడాది పాక్ వేదికగా జరిగే ఆసియా కప్‌లో భారత్ ఆడకపోతే.. వన్డే ప్రపంచకప్‌లో తమ జట్టు పాల్గొనబోదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రజా చేసిన వ్యాఖ్యలపై... క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ప్రపంచ క్రీడల్లో భారత్ అత్యంత శక్తిమంతమైన దేశమని.. తమను ఎవరూ శాసించలేరని అన్నారు.
కొన్నాళ్లు కిందట బీసీసీఐ కార్యదర్శ జైషా... పాక్ లో జరిగే ఆసియా కప్ లో భారత్ ఆడబోదంటూ వ్యాఖ్యలు చేశారు. తటస్థ వేదికలపైనే భారత్, పాకిస్థాన్ తో తలపడుతుందని.. ఆ దేశంలో పర్యటించే అవకాశం లేదని అన్నారు. జైషా వ్యాఖ్యలపై పీసీబీ ఛైర్మన్ రమీజ్ రజా అప్పుడే స్పందించారు. మళ్లీ ప్రస్తుతం ఆయన పీసీబీ చీఫ్ హోదాలో అధికారికంగా ఈ విషయంపై మాట్లాడారు. భారత్, పాక్ లో ఆసియా కప్ ఆడకుంటే... పాకిస్థాన్ 2023 లో భారత్ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్ లో ఆడదని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు.
‘‘భారత్, పాక్ బోర్డుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై సరైన సమయంలో తప్పకుండా స్పందిస్తాం. అయితే ప్రపంచ క్రీడల్లోనే అత్యంత శక్తిమంతమైన దేశం భారత్. ఇతర దేశాలు ఏవీ మాపై అధికారం చెలాయించలేవు’’ అని అనురాగ్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో అన్ని దేశాలు పాల్గొంటాయని గతంలోనే అనురాగ్ తెలిపారు. ఇది బీసీసీఐ అంతర్గత విషయమని, సరైన దిశగానే పరిష్కారమవుతుందని వెల్లడించారు.