Buchi Babu father of south Indian cricket: బుచ్చిబాబు(Buchi Babu)... మనం మరిచిపోయిన మన ఘన చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం.. దక్షిణ భారత క్రికెట్‌ పితామహుడిగా ఎందరో క్రీడాకారులను క్రికెట్‌ వైపు మళ్లించిన అచ్చ తెలుగు మార్గ నిర్దేశకుడు బుచ్చిబాబు. బ్రిటీషర్ల వివక్షతో క్రికెట్‌లో భారత ఆటగాళ్లకు ఎదురైన అవమానాలను చూసి సహించలేని దేశభక్తుడు బుచ్చిబాబు. సొంతంగా  ఓ క్రికెట్‌ క్లబ్‌ను స్థాపించి బ్రిటీషర్లతో క్రికెట్‌ మ్యాచ్‌లను నిర్వహించాలని తపన పడిన కృషీవలుడు బుచ్చిబాబు. రంజీ ట్రోఫీ కంటే మొదలై... శతబ్దానికిపైగా దేశవాళీ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన బుచ్చిబాబు క్రికెట్‌ టోర్నీ గురించి అసలైన విషయాలు తెలుసుకుందాం. ఈ అచ్చ తెలుగు బుచ్చిబాబు సాగించిన క్రికెట్‌ ప్రయాణాన్ని కూడా స్మరించుకుందాం.
  

 

బుచ్చి ది లెజెండ్ క్రికెటర్‌

రంజీ ట్రోఫీ కంటే భారత్‌లో ముందే మొదలైన బుచ్చిబాబు దేశవాళీ టోర్నీకి ఘన చరిత్ర ఉంది. బ్రిటీషర్ల వివక్షకు వ్యతిరేకంగా ఓ దిగ్గజ క్రికెటర్‌ చేసిన పోరాటం ఉంది. ఆ దిగ్గజ క్రికెటర్‌ ఓ తెలుగు వాడు కావడం.. ఎందరో క్రికెటర్లు ఈ టోర్నీ ద్వారా ప్రపంచానికి పరిచయం కావడం విశేషం. ఆ అచ్చమైన తెలుగువాడే బుచ్చిబాబు. అసలు ఈ బుచ్చిబాబు ఎవరు అన్నది ఇప్పుడు ఎక్కువమంది ఆరా తీస్తున్నారు. మనం మర్చిపోయిన మన తెలుగువాడి క్రికెట్‌ ప్రస్థానం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆ బుచ్చిబాబు ఘన చరిత్ర గురించి తెలుసుకుంటే తెలుగువారిగా మన చాతి ఉప్పొంగుతోంది. తెలుగువాడైన బుచ్చిబాబు... దిగ్గజ క్రికెటర్‌గా ఎదిగి దక్షిణ భారత క్రికెట్‌ పితామహుడి స్థాయి పేరును సంపాదించుకున్నారు. భారత్‌ క్రికెట్‌లో ఎందరో దిగ్గజ క్రికెటర్లలో బుచ్చిబాబు ప్రముఖులు. ఆయన స్వాతంత్ర్యానికి ముందు బ్రిటీషర్ల పాలనలోనే దక్షిణ భారతదేశంలో క్రికెట్‌ను ప్రోత్సహించారు. బుచ్చిబాబు ఎనలేని కృషి కారణంగానే దక్షిణ భారతదేశంలో క్రికెట్‌ ఒక మతంగా మారింది. ఎందరో క్రికెటర్లను టీమ్‌ ఇండియాకు అందించింది.  బుచ్చిబాబు పూర్తి పేరు మోతవరపు వెంకట మహిపతి నాయుడు.  ముద్దుగా అందరూ బుచ్చిబాబునాయుడు అని పిలిచేవారు. బుచ్చిబాబు కుటుంబం అప్పటి బ్రిటీషర్ల పాలనలో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ ఉన్నత కుటుంబంగా గుర్తింపు పొందింది. 

 

క్రికెట్‌ దిగ్గజంగా ఎదిగి...

అప్పటి బ్రిటీషర్ల పాలనలో భారత ఆటగాళ్లపై తీవ్ర వివక్ష ఉండేది. బ్రిటిష్ క్రికెటర్లకు సకల సౌకర్యాలు ఉండగా భారత ఆటగాళ్లకు కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కావు. ఈ వివక్ష బుచ్చిబాబును తీవ్రంగా కలచివేసింది. భారత ఆటగాళ్లు చెట్టు కిందే భోజనం చేయడం వంటి ఘటనలు ఆయన జీర్ణించుకోలేకపోయారు. దీంతో ప్రత్యేకంగా క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేయాలని సంకల్పించుకున్నారు. 1888లో మద్రాసులో క్రికెట్ క్లబ్‌ స్థాపించి ఆటగాళ్లకు అవసరమైన మెళకువలు నేర్పి మేటి ఆటగాళ్లుగా మార్చారు. భారత స్థానిక క్రీడాకారులకు, బ్రిటిషర్లకు మధ్య క్రికెట్‌ మ్యాచ్ జరగాలని ఆయన కలగన్నారు. అయితే ఆ కల తీరకుండానే బుచ్చిబాబు అకస్మాత్తుగా మరణించారు. ఆ తర్వాత భారత్‌- బ్రిటీష్‌ జట్ల మధ్య 1908లో మ్యాచ్‌ జరిగింది. ఆయన స్మారకార్థం ఈ టోర్నమెంట్‌కు బుచ్చి బాబు నాయుడు స్మారక టోర్నీ అని పేరు పెట్టారు. ఇక అప్పటి నుంచి ఈ టోర్నమెంట్ జరుగుతోంది. 1934లో రంజీ ట్రోఫీ ప్రారంభం కావడానికి ముందు నుంచీ బుచ్చిబాబు ట్రోఫీని నిర్వహిస్తున్నారు. బుచ్చిబాబు టోర్నమెంట్‌ను ఆగస్టు-సెప్టెంబర్ మధ్య నిర్వహిస్తారు. షెడ్యూల్‌ కారణంగా 2017లో బుచ్చిబాబు టోర్నీకి స్వస్తి పలికారు. ఇప్పుడు 2024లో మళ్లీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు టోర్నీలో భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ పాల్గొన్నారు. ఆగస్టు 15న ప్రారంభమైన ఈ టోర్నీ ఆగస్టు 30న ముగియనుంది.