Saurav Tiwari Gave His Opinion About Dhoni: మహేంద్రసింగ్‌ ధోనీ(Mahendra Singh Dhoni) కూల్‌ కెప్టెన్‌.. టీమిండియా(Team India)కు అత్యధిక ఐసీసీ ట్రోఫీ(ICC Trophies)లు అందించిన కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. అంతేనా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL )లో చెన్నైసూపర్ కింగ్స్‌కు 5 టైటిళ్లు అందించి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్సీతో మ్యాజిక్‌ చేసి గెలవదు అనుకున్న ఎన్నో మ్యాచ్‌లను మలుపు తిప్పి గెలిచేలా చేయడంలో ధోనీ ప్రావీణ్యం అందరికీ తెలిసిందే. 40 ఏళ్ల వయసులోనూ గతేడాది చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలబెట్టి తాను ఎందుకు అంత విజయవంతమైన కెప్టెన్‌నో మరోసారి క్రికెట్‌ ప్రపంచానికి చాటి చెప్పాడు. ఝార్ఖండ్‌ డైనమైట్‌ ధోనీపై అదే రాష్ట్రానికి చెందిన సౌరభ్ తివారీ ప్రశంసల జల్లు కురిపించాడు.


ధోనీ వల్లే ఈ పేరు

ధోనీ భారత జట్టుకు ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి తమ జట్టుకు గుర్తింపు లభించిందని సౌరభ్ తివారీ అన్నాడు. ధోనీ గాడ్‌ ఆఫ్‌ ఝార్ఖండ్‌ క్రికెట్‌ అని పిలుచుకుంటామని తెలిపాడు. ధోనీ తమ అందిరిలో నమ్మకం కలిగించాడని తెలిపాడు. కొన్నిసార్లు వార్మప్‌ మ్యాచుల్లోనూ ధోనీ పాల్గొంటాడని తివారీ వెల్లడించాడు. జట్టుకు సారథ్యం వహించినప్పుడు కూడా ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని గుర్తు చేసుకున్నాడు. ఒక్కోసారి సరైన ప్రదర్శన ఇవ్వకపోయినా మద్దతుగా నిలుస్తాడన్నాడు. ఏ బంతికి ఎలాంటి ఫీల్డింగ్‌ సెటప్‌ పెట్టాలనేది చెబుతాడని సౌరభ్‌ తివారీ వెల్లడించాడు.

 

ధోనినే అసలైన సారథి

ఐపీఎల్‌ ఆల్‌టైమ్‌ అత్యుత్తమ జట్టు సారథిగా ధోనీ ఎంపికయ్యాడు. 2008లో మొదలై బ్లాక్‌బాస్టర్‌ లీగ్‌గా మారిన ఐపీఎల్‌లో ఇప్పటిదాకా ఆడిన ఆటగాళ్లతో అత్యుత్తమ జట్టును వసీం అక్రమ్‌, మాథ్యూ హేడెన్‌, టామ్‌ మూడీ, డేల్‌ స్టెయిన్‌తో కూడిన సెలక్షన్‌ ప్యానల్‌.. 70 మంది పాత్రికేయులతో కలిసి ఎంపిక చేసింది. ఈ జట్టులో ధోనితో పాటు సురేశ్‌ రైనా, ఏబీ డివిలియర్స్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, పొలార్డ్‌, సునీల్‌ నరైన్‌, రషీద్‌ఖాన్‌, చాహల్‌, మలింగ, బుమ్రా ఉన్నారు. ఫిబ్రవరి 20, 2024 నాటికి ఐపీఎల్‌ 16 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ధోని అసలైన సారథి అని. అతడు అందుకోలేని విజయాలు లేవని స్టెయిన్‌ అన్నాడు. ఐపీఎల్‌లో చెన్నైని ధోనీ నడిపించిన తీరు అద్భుతమని ఈ సెలక్షన్‌ కమిటీ కొనియాడింది. మెరుగైన జట్టుతోనూ.. సాధారణ జట్టుతోనూ టైటిళ్లు సాధించిపెట్టిన కెప్టెన్‌ ధోనీ మాత్రమే అని టామ్‌ మూడీ గుర్తు చేశాడు. రోహిత్‌ శర్మ కూడా మంచి సారథే కానీ ముంబయి జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు చాలామంది ఉన్నారన్నాడు.

ఇర్ఫాన్‌ ఏమన్నాడంటే..?

ఎంఎస్‌ ధోనికి కొన్నిరోజుల కిందట కలిశానని. పొడవాటి జుట్టు పెంచుతూ కెరీర్‌ తొలినాళ్లలతో ఉన్న ధోనిలా తయారవుతున్నాడని ధోనీ తెలిపాడు. 40 ఏళ్లు దాటినా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని... ఫ్రాంఛైజీ కోసం, అభిమానుల కోసం ఇంకొన్ని సీజన్లు ఆడేలా అతడు కనిపిస్తున్నాడని పఠాన్‌ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 2023 తరువాత ధోనీ ఐపీఎల్ నుంచి తప్పుకుంటారని ప్రచారం జరిగింది. గతేడాది టోర్నీ సమయంలో ధోనీ మోకాలి గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఐపీఎల్ 2024 టోర్నీలో ఎంఎస్ ధోనీ పాల్గొనడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ధోనీ ఫిట్ గా ఉన్నాడని, రాబోయే సీజన్ లో ఐదుసార్లు విజేతగా నిలిచిన సీఎస్కే జట్టుకు నాయకత్వం వహిస్తాడని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశాడు. ఇప్పుడు ధోనీ ప్రాక్టీస్‌ మొదలెట్టడంతో అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి.