Hardik Pandya Contract: టీమిండియా ఆట‌గాళ్లు ఇషాన్ కిష‌న్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ లు వార్షిక కాంట్రాక్ట్ లు కోల్పోయాక అంద‌రి చూపు ఆల్‌ రౌండ‌ర్ హార్ధిక్ పాండ్యా మీద ప‌డింది. పాండ్యా కూడా రంజీ మ్యాచ్ లు ఆడ‌లేదు క‌దా..? మ‌రి  పాండ్యాను కాంట్రాక్ట్ లిస్ట్‌లో బీసీసిఐ ఎలా ఉంచింది అన్న సందేహం అంద‌రికీ వ‌స్తోంది. దానికి స‌మాధాన‌మే ఈ క‌థ‌నం.


హార్ధిక్ పాండ్యా 2023 అక్టోబ‌ర్‌లో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌యంలో గాయంతో వైదొలిగాడు. అప్ప‌టి నుంచి అత‌ను అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల్లో క‌నిపించ‌లేదు. కానీ, తాజాగా ఇషాన్ కిష‌న్‌తో క‌లిసి ప్రాక్టీస్‌లో క‌నిపించాడు. రిల‌య‌న్స్ క్ల‌బ్ త‌ర‌ఫున మ్యాచ్ లు ఆడుతున్నాడు. అయినా స‌రే బిసీసీఐ పాండ్యా మీద ఎందుకు చర్య‌లు తీసుకోలేదంటే... హార్ధిక్‌ గ‌త‌ కొంత‌కాలంగా టెస్ట్ క్రికెట్ ఆడ‌ట్లేదు. 2018లో సౌతాంప్ట‌న్ లో ఇంగ్లాండ్ తో చివ‌ర‌గా టెస్ట్ మ్యాచ్ ఆడాడు. పాండ్యాకూడా ప‌లు సంద‌ర్భాల్లో నేను రెడ్‌బాల్ క్రికెట్ మీద‌ కాదు వైట్ బాల్ అంటే వ‌న్డే, టీ-20 మ్యాచ్ ల మీద పూర్తి దృష్ఠి పెడుతున్నానని చెప్పాడు. అంటే  ఒక రకంగా టెస్ట్ క్రికెట్ నుంచి అన‌ధికార రిటైర్మెంట్ తీసుకొన్న‌ట్లే అని పాండ్యా వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే అర్ధం అవుతోంది.


ఇక బీసీసిఐ కూడా టెస్ట్ మ్యాచ్‌ల‌కు పాండ్యాను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌ట్లేదు. అందులోనూ పాండ్యాలాంటి ఆల్‌రౌండ‌ర్ టీంకి దొర‌కడం లేదు. శివ‌మ్‌దూబే, అయ్య‌ర్ లాంటి వాళ్లను చూసినా హార్ధిక్ కు ప్ర‌త్యామ్నాయం కాద‌ని తేలిపోంయింది. కాబ‌ట్టి పూర్తిగా వైట్‌బాల్ మీదే ఫోక‌స్ పెట్టాడు పాండ్యా. రంజీ మ్యాచ్ లు ఆడడు అన్న‌మాట‌. ఒక‌వేళ ఇలాంటి స‌మ‌యంలో విజ‌య్‌హ‌జారే ట్రోఫీ, స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్న‌మెంట్ లు ఉండీ హార్ధిక్ అందులో ఆడ‌కుండా కేవ‌లం ఐపీయ‌ల్ మీద దృష్ఠి పెడితే పాండ్యా మీద కూడా కాంట్రాక్ట్ క‌త్తి వేలాడేదే. ఈ కార‌ణాల వ‌ల్లే హార్ధిక్ పాండ్యా ను బీసీసిఐ మిన‌హాయింపునిచ్చిందని తెలుస్తోంది.