టీమిండియా(Team India) ఉమెన్స్‌ టీం ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ(Deepti Sharma) అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఎందరో దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డును సృష్టించింది. విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma), బుమ్రా(Bumrah) వంటి దిగ్గజాల‌కు సాధ్యంకాని రికార్డును త‌న పేరిట లిఖించుకుని చరిత్ర సృష్టించింది. టీ20ల్లో 1,000 ప‌రుగులు పూర్తి చేసుకోవ‌డంతో పాటు వంద వికెట్లు తీసిన తొలి భార‌త క్రికెట‌ర్‌గా దీప్తి రికార్డు నెల‌కొల్పింది. ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో టీ20మ్యాచ్‌లో దీప్తి శ‌ర్మ ఈ ఘ‌నత సాధించింది. ఈ మ్యాచ్‌లో 30 ప‌రుగుల‌ు చేసిన దీప్తీ... బౌలింగ్‌లో స‌త్తా చాటుతూ రెండు కీల‌క వికెట్లు తీసింది. 

 

భారత్‌కు ఆస్ట్రేలియా షాక్‌ 

రెండో టీ 20 మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలనుకున్న భారత్‌ ఆశలు నెరవేరలేదు. కీలకమైన రెండో టీ 20లో భారత్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కంగారులు.. సునాయస విజయం సాధించారు. తొలుత బాల్‌తో టీమిండియాను కట్టడి చేసిన ఆస్ట్రేలియా మహిళలు.. తర్వాత స్వల్ప లక్ష్యాన్ని మరో ఓవర్‌ మిగిలి ఉండగానే ఛేదించారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా... భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.  టీమిండియా నామామత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఆసీస్‌ బౌలర్లు రాణించడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది. రెండో ఓవర్‌లోనే షెఫాలీ వర్మ అవుటవ్వగా.. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్ల పతనం కొనసాగింది. దీప్తి శర్మ (30) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. రిచా ఘోష్‌ (23), స్మృతి మంధన (23), జెమీమా రోడ్రిగెజ్‌ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఆసీస్‌ బౌలర్లలో జార్జీయా వేర్హమ్‌, అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌, కిమ్‌ గార్త్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆష్లే గార్డ్‌నర్‌ ఓ వికెట్‌ దక్కించుకుంది. 

 

ఆసిస్‌ సునాయసంగా

131 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్లు అలిసా హీలీ (26), బెత్ మూనీ (20) ఆస్ట్రేలియాకు శుభారంభం అందించారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం వీరిద్దరినీ దీప్తి శర్మ వరుస ఓవర్లలో ఔట్ చేయడంతో భారత్‌ పోటీలోకి వచ్చింది. నిలకడగా ఆడిన తాహ్లియా మెక్‌గ్రాత్ (19)ని శ్రేయంక పాటిల్‌ వెనక్కి పంపింది. కాసేపటికే పుజా వస్త్రాకర్‌.. ఆష్లీన్‌ గార్డ్‌నర్‌ (7)ని ఔట్ చేసింది. ఆష్లీన్‌ వికెట్‌కీపర్‌ రిచా ఘోష్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరింది. దీంతో మ్యాచ్‌ కాస్త ఉత్కంఠగా మారినా.. ఎలిస్‌ పెర్రీ (34; 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), లిచ్‌ఫీల్డ్ (18; 12 బంతుల్లో 3 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో ఆరు బంతులు మిగిలుండగానే ఆసీస్‌ విజయం సాధించింది. శ్రేయంక వేసిన 19 ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌లో చివరి బంతికి పెర్రీ సిక్స్‌ బాది జట్టుకు విజయాన్ని అందించింది. సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్‌ రేపు జరగనుంది.