దురుసు ప్రవర్తనతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బంగ్లాదేశ్‌(Bangladesh) స్టార్‌ ఆల్‌రౌండర్‌, కెప్టెన్‌ షకీబుల్‌ హసన్‌(Shakib Al Hasan) మరోసారి అలాంటి ప్రవర్తనతోనే వార్తల్లో నిలిచాడు. ఆన్‌ఫీల్డ్‌లో తన దుందుడుకు స్వభావంతో ఎన్నోసార్లు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించి చిక్కుల్లో పడ్డ ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌.. మరోసారి తన అభిమాని చెంప చెళ్లుమనిపించి వార్తల్లో నిలిచాడు. ఇటీవలే రాజకీయాల్లోకి దిగి అవామీ లీగ్‌ పార్టీ(Awami League party) తరఫున ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన షకీబ్‌.. పోలింగ్‌ రోజున సొంత అభిమానిపై చేయి చేసుకున్నాడు. ఓ పోలింగ్‌ స్టేషన్‌ సందర్శనకు వెళ్లిన షకీబ్‌ను సదరు అభిమాని వెనక నుంచి నెట్టడంతో సహనం కోల్పోయి షకీబుల్‌ హసన్‌ చెంప చెళ్లుమనిపించాడు. ఇప్పుడు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో షకీబ్‌ ఎంపీగా గెలిచాడు. షకీబ్‌ తన సమీప ప్రత్యర్ధి ఖాజీ రేజౌల్‌ హొస్సేన్‌పై లక్షాన్నరకుపైగా ఓట్ల తేడాతో గెలిచాడు. ఈ ఎన్నికల్లో షకీబ్‌ పార్టీ అవామీ లీగ్‌ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ అవామీ లీగ్‌ పార్టీకి ప్రస్తుత బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ పార్టీ పూర్తి మెజార్టీ సాధించడంతో షేక్‌ హసీనానే మళ్లీ ప్రధాన పదవి చేపట్టనున్నారు.

 

వరల్డ్‌కప్‌లో టైమ్డ్‌ అవుట్‌ వివాదం

146 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో తొలిసారి శ్రీలంక(Sri Lanka) క్రికెటర్‌ ఏంజెలో మాథ్యూస్‌(Angelo Mathews) టైమ్‌డ్‌ ఔట్‌(Timed Out)గా పెవిలియన్‌కు చేరాడు. శ్రీలంక, బంగ్లాదేశ్(Bangladesh) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. రెండు నిమిషాల్లోగా అతను బంతిని ఎదుర్కోకపోవడంతో మాథ్యూస్‌ను అంపైర్లు టైమ్ ఔట్‌గా ప్రకటించారు. దీంతో అతడు ఒక్క బంతి ఆడకుండానే పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంతవరకూ ఏ ఒక్క బ్యాటర్ కూడా ఈ విధంగా ఔట్ అవ్వలేదు. ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్(Shakib Al Hasan).. మాధ్యూస్‌ను టైమ్డ్‌ అవుట్‌ అంటూ అప్పీల్‌ చేశాడు. అంపైర్లు రెండుసార్లు అప్పీల్‌ను వెనక్కి తీసుకోవాలని కోరినా షకీబుల్‌ హసన్‌ నిరాకరించడంతో ఏంజెలో మాధ్యూస్‌ కోపంగా పెవిలియన్‌కు చేరాడు. ఇప్పుడు ఈ ఘటనపై మాథ్యూస్ స్పందించాడు. బంగ్లాదేశ్‌ కాకుండా మరే ఇతర జట్టు మైదానంలో ఉన్నా ఇలా టైమ్డ్‌ అవుట్‌ కోసం అప్పీల్‌ చేసి ఉండేది కాదని అన్నాడు.

 

షకీబుల్‌ ఇదేనా క్రీడా స్ఫూర్తి..

తన టైమ్డ్‌ అవుట్‌పై స్పందించిన ఈ శ్రీలంక ఆల్‌రౌండర్‌.. బంగ్లా కాకుండా మరే జట్టైనా టైమ్డ్‌ అవుట్‌కు అప్పీల్‌ చేసి ఉండేది కాదని అన్నాడు. ఈ అవుట్‌ తర్వాత ఏంజెలో మాథ్యూస్... మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్‌పై చాలా అసహనం ప్రదర్శించాడు. మ్యాచ్ తర్వాత విలేకరులతో మాట్లాడిన మాథ్యూస్‌ టైమ్డ్‌ అవుట్‌ వివాదంపై స్పందించాడు. బంగ్లాదేశ్ జట్టును, షకీబుల్‌ హసన్‌ను తాను చాలా గౌరవిస్తానని... తానైతే అలా టైమ్డ్‌ అవుట్‌కు అప్పీల్‌ చేసే వాడిని కాదని హసన్‌ అన్నాడు. ఇది చాలా సిగ్గుమాలిన చర్య అని, మరేదైనా జట్టు ఉండి ఉంటే అసలు అలా చేసి ఉండేదే కాదని ఏంజెలో మాథ్యూస్‌ అన్నాడు. షకీబ్‌పై మాథ్యూస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలా క్రికెట్ ఆడటం సిగ్గుచేటన్నాడు. తాను కావాలని సమయం వృథా చేయలేదని, తాను సమయానికే క్రీజులోకి వచ్చానని... అది అందరూ చూశారని, కానీ తన హెల్మెట్ పట్టీ విరిగిపోవడంతో బాల్‌ను ఎదుర్కొనేందుకు ఆలస్యమైందని మాథ్యూస్‌ తెలిపాడు.