India vs Bangladesh second Test: కాన్పూర్‌ వేదికగా జరిగే రెండో టెస్ట్‌కు భారత్‌-బంగ్లాదేశ్(India vs Bangladesh) సిద్ధమయ్యాయి. తొలి టెస్టులో గెలిచి మంచి ఊపు మీదున్న టీమిండియా... రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది. మరోవైపు పాకిస్థాన్(Pakistan)  గడ్డపై పాక్‌నే మట్టికరిపించి భారత్‌లో అడుగుపెట్టిన బంగ్లాదేశ్... తొలి టెస్టులో ఘోరంగా ఓడిపోయింది. అన్ని విభాగాల్లోనూ భారత్‌ పటిష్టంగా కనిపిస్తుండగా... మరోవైపు బంగ్లా మాత్రం బలహీనంగా కనిపిస్తోంది. తొలి టెస్టు విజయంలో స్వదేశంలో తాము ఎంత బలమైన జట్టో భారత్ మరోసారి చాటిచెప్పింది. చెన్నైలో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 144 పరుగులు చేసి క్లిష్టమైన స్థితి నుంచి పోరాడి టీమిండియా విజయం సాధించింది. 


Read Also: మన విరాట్‌కే ఏమైంది? - కోహ్లీని 15 బంతుల్లో 4 సార్లు అవుట్‌ చేసిన బుమ్రా


అన్ని విభాగాల్లోనూ పటిష్టం

భారత జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్, ఫీల్డింగ్‌ల్లో పటిష్టంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ(Rohit sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) మాత్రం విఫలమయ్యారు. తొలి టెస్టులో వీరిద్దరూ నాలుగు ఇన్నింగ్సుల్లో కేవలం 34 పరుగులు మాత్రమే చేశారు. కానీ భారత్‌ తొలి టెస్టులో అద్బుత విజయం సాధించగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్‌(Aswin), రెండో ఇన్నింగ్స్‌లో పంత్(Panth), గిల్(Gill) శతకాలతో మెరవడంతో భారత్ భారీ విజయం సాధించగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత సీమర్లు ఎనిమిది వికెట్లు తీసుకోగా... రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు తొమ్మిది వికెట్లు తీశారు. భారత దూకుడు చూస్తుంటే కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌కు అంత ఈజీ కాదని తెలుస్తోంది. కాన్పూర్‌లో భారత్‌కు చాలా స్పష్టమైన రికార్డు కూడా ఉంది. ఇక్కడ న్యూజిలాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌ను  భారత్ డ్రా చేసుకుంది. 

 

పిచ్‌ ఎలా ఉంటుందంటే..?

కాన్పూర్‌లో గ్రౌండ్ సిబ్బంది రెండు పిచ్‌లను సిద్ధం చేస్తున్నారు. ఏ పిచ్‌పై మ్యాచ్‌ నిర్వహిస్తారన్నది మ్యాచ్‌ జరిగే రోజే తేలనుంది. కాన్పూర్ పిచ్‌.. ఉదయం ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉంది. చివరి రెండు రోజులలో స్పిన్నర్‌లకు సహాయం పడుతుంది. మొదటి మూడు రోజుల్లో మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. టాస్‌ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ చేసే అవకాశం ఉంది.

 


 

భారత జట్టు ఫైనల్ 11‍( అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్,  KL రాహుల్, రవీంద్ర జడేజా, R. అశ్విన్, కుల్దీప్ యాదవ్/అక్సర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ 

 

బంగ్లాదేశ్ జట్టు ఫైనల్‌ 11‍( అంచనా): షద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్ , మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్