Bangladesh Allrounder Shakib Al Hassan Retirement : కాన్పూర్‌(Kanpur) తో జరిగే రెండో టెస్టుకు భారత్‌-బంగ్లాదేశ్(India-Bangladesh) సిద్ధమవుతున్న వేళ.. బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్(Shakib Al Hassan) బాంబు పేల్చాడు. కాన్పూర్ టెస్టుకు ముందు తన కెరీర్ చివరి దశకు వచ్చేసిందని ప్రకటించి.. క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేశాడు. 

రేపటి నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా రెండో టెస్ట్ ఆరంభం కానుంది. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌ మైదానం(Green park stadium)లో జరిగే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ సమయంలో షకీబ్ అల్ హసన్ ప్రకటన తీవ్ర కలకలం రేపింది.  బంగ్లాదేశ్ తరపున తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను  మిర్పూర్‌లో ఆడాలని ఉందని.. ఒకవేళ అలా జరగని పక్షంలో రేపటి నుంచి ఆరంభం కానున్న కాన్పూర్ టెస్టే.... సుదీర్ఘ ఫార్మట్‌లో తన చివరి మ్యాచ్ అని ఈ స్టార్‌ ఆల్ రౌండర్ ప్రకటించాడు. దక్షిణాఫ్రికాతో మిర్పూర్‌లో బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఆ సిరీస్‌కు షకీబ్‌ను ఎంపిక చేయకపోతే కాన్పూర్ టెస్టే ఆఖరి మ్యాచ్ కానుంది. కానీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు దక్షిణాఫ్రికాతో మిర్పూర్ టెస్టుకు షకీబ్‌ను ఎంపిక చేసే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య రెండో టెస్టుకు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో షకీబ్  ఈ ప్రకటన చేశాడు.




చెన్నై టెస్టులో విఫలం
భారత్‌తో జరిగిన చెన్నై టెస్టులో షకీబ్ అల్ హసన్ పూర్తిగా నిరాశపరిచాడు. ఈ టెస్టులో షకీబ్ అల్ హసన్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 25 పరుగులు మాత్రమే చేశాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో ఓటమి తర్వాత షకీబ్ అల్ హసన్ ఫిటెనెస్‌పై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఫిటెనెస్‌ లేని షకీబ్ అల్ హసన్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చడాన్ని బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ ఇప్పటికే ప్రశ్నించాడు.  గాయపడినా కూడా షకీబ్ అల్ హసన్ భారత్‌తో జరిగిన మొదటి టెస్టులోఆడాడని తీవ్ర ఆరోపణలు చేశాడు. అయితే ఈ ఆరోపణలను బంగ్లాదేశ్ చీఫ్ కోచ్ చండికా హతురుసింగ్ కొట్టి పారేశారు. షకీబ్ అల్ హసన్ పూర్తి ఫిటెనెస్‌తో ఉన్నాడని... అతని గురించి ఎటువంటి సందేహం అవసరం లేదని తేల్చేశాడు. టీ 20 క్రికెట్‌కు కూడా షకీబ్ వీడ్కోలు పలికేశాడు.  ప్రపంచకప్ తర్వాత టీ 20కి వీడ్కోలు పలికానని... ఆ విషయాన్ని మరోసారి ధ్రువీకరిస్తున్నట్లు షకీబ్ వెల్లడించాడు. 


Read Also: కాన్పూర్‌లో గత రికార్డులన్నీ మనవే అత్యధిక పరుగులు చేసింద ఎవరంటే?


బంగ్లా క్రికెట్ నాకు చాలా ఇచ్చింది
"మిర్పూర్‌లో నా చివరి టెస్టు ఆడాలని ఉంది. అది జరగకపోతే, భారత్‌తో జరిగే రెండో టెస్టు నా చివరి టెస్టు అవుతుంది" అని షకీబ్ పేర్కొన్నాడు. "బంగ్లాదేశ్ క్రికెట్ నాకు చాలా ఇచ్చింది, నేను స్వదేశంలో ఈ ఫార్మాట్‌లో చివరిగా ఆడి వీడ్కోలు పలకాలని అనుకుంటున్నాను." అని అతను చెప్పాడు. 


సుదీర్ఘ కెరీర్
బంగ్లాదేశ్ తరపున టెస్టుల్లో మే 2007లో షకీబ్ అల్ హసన్ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకూ 70 టెస్టులు ఆడాడు. షకీబ్ ఐదు సెంచరీలు, 31 అర్ధ సెంచరీలతో సహా 4,600 పరుగులు సాధించాడు, బంగ్లాదేశ్ టెస్ట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. బౌలింగ్‌లో షకీబ్ 242 వికెట్లు పడగొట్టి, టెస్ట్ క్రికెట్‌లో బంగ్లాదేశ్‌కు అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో టెస్టుల్లో 200 వికెట్ల మార్క్‌ను అధిగమించిన ఏకైక బౌలర్‌ షకీబుల్ హసనే. బంగ్లాదేశ్ తరపున షకీబ్ అల్ హసన్ 129 T20 మ్యాచ్‌లు ఆడాడు. 121.18 స్ట్రైక్ రేట్‌తో 2,551 పరుగులు చేశాడు. 126 ఇన్నింగ్స్‌లలో, షకీబ్ 149 వికెట్లు తీశాడు, 150 మార్కుకు కేవలం ఒకే ఒక్క వికెట్ దూరంలో వీడ్కోలు పలికాడు.