Australias Win vs India: భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ ముగిసి రెండు రోజులైంది. సెమీస్ వరకు అద్భుతంగా ఆడిన టీమిండియా ఫైనల్లో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ ముగిసిన రోజు నుంచి అభిమానులంతా తీవ్ర దు:ఖంలో ఉన్నారు. మ్యాచ్ ముగిశాక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. రోహిత్ శర్మ పెవిలియన్‌కు తిరిగి వస్తుండగా అతని కళ్ల నుంచి నీళ్లు కనిపించాయి. అదే సమయంలో విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ కూడా చాలా ఎమోషనల్‌ అయినట్టు కనిపించారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇక మళ్లీ ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉండదేమో అనే బాధ అభిమానుల కలచివేస్తోంది. ప్రపంచకప్ ఫైనల్ ముగిసి సమయం గడుస్తున్నా ఆ బాధ నుంచి ఇప్పటికీ అభిమానులు కోలుకోలేకపోతున్నారు. ప్రపంచకప్ అందినట్టే అంది చేజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఫైనల్లో టీమిండియాపై విజయం సాధించడంపై ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ స్పందించాడు. భారత అభిమానుల హృదయాలను గాయపరిచినందుకు వార్నర్‌ క్షమాపణలు తెలిపాడు. భారత అభిమానులారా నన్ను క్షమించండి... మ్యాచ్‌ అద్భుతంగా జరిగింది. అహ్మదాబాద్‌ మైదానం వాతావరణం అత్యద్భుతంగా ఉందని వార్నర్‌ సోషల్‌ మీడియా ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రపంచకప్‌ విజేతగా నిలవాలని టీమిండియా శక్తియుక్తులా పోరాడిందని... అందరికీ ధన్యవాదాలంటూ వార్నర్‌ ట్వీట్‌ చేశాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో వార్నర్‌ ఫీల్డింగ్‌తో ఎంతో ఆకట్టుకొన్నాడు. తాను 2027లో దక్షిణాఫ్రికాలో జరిగే వరల్డ్‌కప్‌ కూడా ఆడే ఉద్దేశంలో ఉన్నట్టు వార్నర్‌ చూచాయగా చెప్పాడు. ‘ఎవరు చెప్పారు నా పనైపోయింద’ని కూడా వార్నర్‌ ట్వీట్‌ చేశాడు. 


ప్రపంచకప్ 2023లో భారత్‌పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలోని ఆటగాళ్లతో పాటు అభిమానులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ ఓటమి మైదానంలో ఉన్న లక్ష మందికిపైగా అభిమానులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల హృదయాలను కలచివేసింది. టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.  టీమిండియా ఓటమితో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలోని ఆటగాళ్లతో పాటు అభిమానులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ ఓటమి మైదానంలో ఉన్న లక్ష మందికిపైగా అభిమానులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల హృదయాలను కలచివేసింది. 



భారత్‌తో సిరీస్‌కు వార్నర్‌కు విశ్రాంతి
 మరోవైపు భారత్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌లో వార్నర్‌కు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. మాథ్యూ వేడ్‌ సారథ్యంలోని టీ20 జట్టును ఆసీస్‌ సెలెక్టర్లు ప్రకటించారు. వరల్డ్‌కప్‌లో ఆసిస్‌ తరఫున అత్యధికంగా 535 పరుగులు చేసిన వార్నర్‌ను కొద్ది రోజుల ముందు ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు. వార్నర్‌తోపాటు కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, హాజెల్‌వుడ్‌, గ్రీన్‌, మార్ష్‌ కూడా స్వదేశానికి తిరిగి వెళ్లనున్నారు. ఇక, వరల్డ్‌కప్‌లో ఆడిన ఏడుగురు ఆటగాళ్లు అబాట్‌, హెడ్‌, ఇంగ్లిస్‌, మ్యాక్స్‌వెల్‌, స్మిత్‌, లబుషేన్‌, జంపాలు టీ20 సిరీస్‌ జట్టులో చోటుదక్కించుకొన్నారు. పాకిస్థాన్‌తో జరిగే టెస్టు సిరీస్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకనున్నట్టు వార్నర్‌ గతంలోనే ప్రకటించాడు.