Border Gavaskar Trophy: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న భారత్- ఆస్ట్రేలియా తొలి టెస్టులో టీమిండియా అదరగొట్టింది. బంతితో ఆ జట్టును 177 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా.. బ్యాట్ తోనూ ఆకట్టుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 77 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (56 నాటౌట్) అర్ధసెంచరీతో రాణించాడు. 


హిట్‌మ్యాన్‌ ఫిఫ్టీ


కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (56 బ్యాటింగ్‌; 69 బంతుల్లో 9x4, 1x6) అద్వితీయమైన హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. కంగారూ బౌలర్లను కంగారెత్తించాడు. 66 బంతుల్లోనే 50 మార్క్‌ దాటేశాడు. అతడికి తోడుగా ఓపెనింగ్‌కు వచ్చిన కేఎల్‌ రాహుల్‌ (20; 71 బంతుల్లో 1x4) నిలకడగా ఆడినా ఆఖర్లో వికెట్‌ ఇచ్చేశాడు. మర్ఫీ వేసిన 22.5వ బంతికి ఔటయ్యాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (0 బ్యాటింగ్‌; 5 బంతుల్లో) నైట్‌వాచ్‌మన్‌గా వచ్చాడు.


ఈ మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా విజృంభించాడు. దాదాపు 5 నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన జడ్డూ.. పునరాగమనం చేసిన తొలి మ్యాచ్ లోనే 5 వికెట్లు పడగొట్టి వహ్వా అనిపించాడు. ప్రపంచ నెం. 1 ఆల్ రౌండర్ అయిన జడేజా స్పిన్ మాయాజాలానికి ఆస్ట్రేలియా విలవిల్లాడింది. ఆసీస్ బ్యాటర్లు మార్నస్ లబూషేన్, రెన్ షా, స్టీవెన్ స్మిత్, హ్యాండ్స్ కాంబ్, ముర్ఫీలను జడేజా ఔట్ చేశాడు. ఇందులో స్మిత్ ను జడేజా బౌల్డ్ చేసిన తీరు ఈ ఇన్నింగ్స్ కే హైలైట్ అనేలా ఉంది.


జడేజా స్టన్నర్ బాల్ 


ఇన్నింగ్స్ 42వ ఓవర్ చివరి బంతికి స్టీవ్ స్మిత్ ను జడేజా బౌల్డ్ చేశాడు. అప్పటికి 37 పరుగులు చేసిన స్మిత్ మంచి టచ్ లో కనిపించాడు. జడ్డూ విసిరిన బంతి నేరుగా వచ్చి స్మిత్ డిఫెన్స్ ను ఛేదిస్తూ ఆఫ్ స్టంప్ ను గిరాటేసింది. తను ఔటైన తీరును స్మిత్ నమ్మలేకపోయాడు. ఒక్క క్షణంపాటు అలాగే చూస్తుండిపోయాడు. కామెంట్రీ బాక్సులో ఉన్న రవిశాస్త్రి సైతం ఆ బంతిని ఆబ్సల్యూట్ బ్యూటీ అంటూ పొగిడాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. 






గాయంతో 5 నెలలు దూరం


మోకాలి గాయం కారణంగా గతేడాది ఆగస్ట్ నుంచి జడేజా మైదానంలోకి దిగలేదు. సర్జరీ చేయించుకుని ఎన్ సీఏ లో కోలుకున్న తర్వాత ఇటీవలే రంజీల్లో ఆడాడు. రంజీ మ్యాచుల్లో రాణించిన జడ్డూ ఆస్ట్రేలియాతో తొలి టెస్టులోనే ఆకట్టుకున్నాడు. 2017 బోర్డర్- గావస్కర్ సిరీస్ లోనూ రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ గా రాణించి జట్టు సిరీస్ గెలుచుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇప్పుడూ అతని నుంచి అలాంటి ప్రదర్శనే జట్టు ఆశిస్తోంది. అందుకు తగ్గట్లే తొలి ఇన్నింగ్స్ లో బంతితో అదరగొట్టాడు.