IND vs AUS, 1st Test:
స్పిన్ ఆడటం చేతకాక భారత పిచ్‌లను విమర్శించిన ఆసీస్ చివరి తన గోతిలో తనే పడింది! మొదట బ్యాటింగ్ ఎంచుకొని ఇదే స్పిన్‌తో టీమ్‌ఇండియాను దెబ్బకొట్టాలని భావించి తనే భంగపడింది. కనీసం ఒక్కరోజైనా బ్యాటింగ్ చేయలేదు. రెండు సెషన్లకు మించి ఆ జట్టు బ్యాటర్లు నిలబడలేదు.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ రసవత్తరంగా మొదలైంది. నాగ్‌పుర్ టెస్టులో తొలిరోజు టీమ్‌ఇండియాదే పైచేయి! మొదట బంతితో ప్రత్యర్థిని విలవిల్లాడించిన హిట్‌మ్యాన్ సేన బ్యాటుతోనూ మురిపించింది. ఆసీస్‌ను 177కే కుప్పకూల్చిన ఆతిథ్య జట్టు ఆట ముగిసే ఒక వికెట్ నష్టపోయి 77 పరుగులు చేసింది.100 పరుగుల లోటుతో ఉంది.
హిట్‌మ్యాన్ ఫిఫ్టీ
కెప్టెన్ రోహిత్ శర్మ (56 బ్యాటింగ్; 69 బంతుల్లో 9x4, 1x6) అద్వితీయమైన హాఫ్ సెంచరీ అందుకున్నాడు. కంగారూ బౌలర్లను కంగారెత్తించాడు. 66 బంతుల్లోనే 50 మార్క్ దాటేశాడు. అతడికి తోడుగా ఓపెనింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ (20; 71 బంతుల్లో 1x4) నిలకడగా ఆడినా ఆఖర్లో వికెట్ ఇచ్చేశాడు. మర్ఫీ వేసిన 22.5వ బంతికి ఔటయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ (0 బ్యాటింగ్; 5 బంతుల్లో) నైట్‌వాచ్‌మన్‌గా వచ్చాడు.
చుక్కలు చూపిన స్పిన్నర్లు
మొదట టీమ్‌ఇండియా దుమ్మురేపింది! పర్యాటక ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించింది. తొలి ఇన్నింగ్సులో ప్రత్యర్థిని 177 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇందుకోసం కేవలం 63.5 ఓవర్లే తీసుకుంది. భారత స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా (5/47), రవిచంద్రన్ అశ్విన్ (3/42) దెబ్బకు కంగారూలు వణికిపోయారు. టర్నయ్యే బంతుల్ని ఆడలేక బ్యాట్లెత్తేశారు. మార్నస్ లబుషేన్ (49; 12౩ బంతుల్లో 8x4), స్టీవ్‌స్మిత్ (37; 107 బంతుల్లో 7x4) టాప్ స్కోరర్లు.
స్మిత్, లబుషేన్ పోరాటం కాసేపే!
స్పిన్ పిచ్ కావడంతో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఎండకాస్తే పిచ్ విపరీతంగా టర్న్ అవుతుందని, రెండోరోజు టీమ్‌ఇండియాకు కష్టమవుతుందని అనుకుంది. కానీ తొలిరోజే వారు గింగిరాలు తిరిగే బంతులకు వికెట్లు పారేసుకున్నారు. రెండు పరుగుల వద్దే ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (1), డేవిడ్ వార్నర్ (1) పెవిలియన్‌కు చేరుకున్నారు. షమి వేసిన బంతికి వార్నర్ సెంటర్ వికెట్టు ఎగిరి అవతలపడింది. ఖవాజాను సిరాజ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ సిచ్యువేషన్లో స్మిత్, లబుషేన్ నిలకడగా ఆడారు. 76/2తో లంచ్‌కు వెళ్లారు. మూడో వికెట్‌కు 202 బంతుల్లో 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
జడ్డూ.. రాక్‌స్టార్!
భోజన విరామం తర్వాతే అసలు కథ మొదలైంది. జట్టు స్కోరు 84 వద్ద జడ్డూ బౌలింగ్‌లో లబుషేన్ స్టంపౌట్ అయ్యాడు. అరంగేట్రం ఆటగాడు, ఆంధ్రా కీపర్ కేఎస్ భరత్ అతడిని ఔట్ చేశాడు. అదే స్కోరు వద్ద స్మిత్‌నూ జడ్డూనే ఔట్ చేశాడు. మ్యాట్ రెన్షా (0)ను డకౌట్ చేశాడు. కష్టాల్లో పడ్డ ఆసీస్‌ను పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (31; 84 బంతుల్లో 4x4), అలెక్స్ కేరీ (36; 33 బంతుల్లో 7x4) ఆదుకొన్నారు. ఆరో వికెట్‌కు 68 బంతుల్లో 53 పరుగుల భాగస్వామ్యం అందించారు. కీలకంగా మారిన ఈ జోడీని కేరీని ఔట్ చేయడం ద్వారా యాష్ విడదీశాడు. అప్పటికి స్కోరు 162. మరో పది పరుగులకే హ్యాండ్స్‌కాంబ్‌ను జడ్డూ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కంగారూలు ఔటవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు.