KS Bharat Emotional:  తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ ఎట్టకేలకు భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో కేఎస్ భరత్ స్థానం సంపాదించాడు. ఛతేశ్వర్ పుజారా చేతుల మీదుగా భరత్ టెస్ట్ క్యాప్ అందుకున్నాడు. ఈ సందర్భంగా అతను ఉద్వేగానికి గురయ్యాడు. 


ఇక్కడ వరకు వస్తానని అనుకోలేదు


'ఇంత సుదీర్ఘ ప్రయాణం తర్వాత వెనక్కు తిరిగి చూసుకుంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా టెస్ట్ జెర్సీని చూసి నిజంగా గర్వంగా అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడడం ప్రారంభించినప్పుడు ఇక్కడ దాకా వస్తానని అనుకోలేదు. అయితే నేను ఇక్కడ వరకు చేరుకోగలనని నా కోచే జయకృష్ణారావు నమ్మారు. ఈ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది.' అని భరత్ అన్నాడు.






నా ఆట నన్ను ఆడమని చెప్పారు 


'ఇక్కడికి చేరుకోవడానికి ముందు నేను 2018లో ఇండియా-ఎ తరఫున అరంగేట్రం చేశాను. అప్పుడు రాహుల్ ద్రవిడ్ సార్ ఆ జట్టుకు కోచ్‌గా ఉన్నారు. నా ప్రయాణం ఎప్పుడూ నిదానంగా సాగుతుంది. నేను ఇంగ్లండ్‌లో ఇండియా ఎ తరఫున ఆడినప్పుడు ద్రవిడ్ సార్ తో చాలా చర్చించాను. నా ఆటను తదుపరి స్థాయికి ఎలా తీసుకెళ్లాలో రాహుల్ సార్ ను అడిగాను. 'నువ్వు బాగానే ఆడుతున్నావు. ఇప్పుడెలా ఆడుతున్నావో దాన్నే కొనసాగించు అని ద్రవిడ్ సర్ అన్నారు.' అని భరత్ గుర్తుచేసుకున్నాడు. ఇప్పుడు టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. 


దాదాపు ఏడాదిన్నరగా టెస్టు స్క్వాడ్ లో కేఎస్ భరత్ ఉంటున్నాడు. అయితే తుది జట్టులో మాత్రం అతనకి చోటు దక్కలేదు. ఇప్పుడు రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ప్రమాదంలో గాయపడి జట్టుకు దూరమవటంతో భరత్ కు స్థానం లభించింది. ఇషాన్ కిషన్ పోటీలో ఉన్నప్పటికీ కోచ్, కెప్టెన్ భరత్ కే ఓటేశారు. 


సీఎం జగన్ అభినందనలు


బోర్డర్- గావస్కర్ సిరీస్ తో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ కు ముఖ్యమంత్రి జగన్ అభినందనలు తెలిపారు. టీమిండియా తరఫున రాణించాలని ఆకాంక్షించారు. తెలుగు ఖ్యాతిని భరత్ ఇనుమడింపజేశారని ప్రశంసించారు.