CM jagan On KS Bharat:  తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ కల నెరవేరింది. టీమిండియాకు ఆడాలన్న అతని లక్ష్యం పరిపూర్ణమైంది. ఏడాదిన్నరగా జట్టులో ఉంటున్నా బెంచ్ కే పరిమితమైన ఆంధ్రా క్రికెటర్ కేఎస్ భరత్.. ఎట్టకేలకు బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. భారత్- ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ లో భరత్ కు స్థానం లభించింది. రంజీల్లో నిలకడగా రాణించిన భరత్ అంతర్జాతీయ మ్యాచ్ లోనూ అదే ప్రదర్శన కొనసాగించాలని కోరుకుంటున్నాడు. 


స్వదేశంలో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ లో టెస్ట్ క్యాప్ అందుకున్న కేఎస్ భరత్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సహచరుల అభినందనలతో టీమిండియా క్యాప్ అందుకుని ఉద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో బీసీసీఐ ట్విట్టర్ లో షేర్ చేసింది. వికెట్ కీపర్ గా భరత్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. 






సీఎం జగన్ అభినందనలు


బోర్డర్- గావస్కర్ సిరీస్ తో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ కు ముఖ్యమంత్రి జగన్ అభినందనలు తెలిపారు. టీమిండియా తరఫున రాణించాలని ఆకాంక్షించారు. తెలుగు ఖ్యాతిని భరత్ ఇనుమడింపజేశారని ప్రశంసించారు. 


భారత్- ఆస్ట్రేలియా తొలి టెస్ట్ ప్రారంభం అయ్యింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. 


కేఎస్ భరత్, సూర్యకుమార్ టెస్ట్ అరంగేట్రం


'టాస్ గెలిస్తే మేం కూడా బ్యాటింగ్ చేసి ఉండేవాళ్లం. పిచ్ పొడిగా కనిపిస్తుంది. స్పిన్నర్లకు సహాయం ఉంటుంది. అయితే ఇది ఎంత వరకు ఉంటుందో వేచి చూడాలి. నిన్న మేము ప్రాక్టీస్ ప్రారంభించినప్పుడు పేసర్లకు కొంత సీమ్ లభించింది. మేము గత 5-6 రోజులుగా మంచి ప్రాక్టీస్ చేశాము. ఈ సిరీస్ యొక్క ప్రాముఖ్యత మాకు తెలుసు. అయితే ప్రస్తుతం మేం ఒక సెషన్ గెలవడం గురించి ఆలోచించాలి. ఇది సుదీర్ఘ సిరీస్. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్లతో బరిలోకి దిగుతున్నాం. కేఎస్ భరత్, సూర్యకుమార్ యాదవ్ టెస్ట్ అరంగేట్రం చేస్తున్నారు.' అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.