Big Bash League: బిగ్ బాష్ లీగ్ లో సంచలనం. ఈ టోర్నీ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదైంది. సిడ్నీ థండర్స్ జట్టు 15 పరుగులకే ఆలౌట్ అయ్యి అత్యంత చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. అంతేకాక పవర్ ప్లే కూడా ముగియకముందే అన్ని వికెట్లు కోల్పోయిన జట్టుగా నిలిచింది.
బిగ్ బాష్ లీగ్ లో భాగంగా శుక్రవారం అడిలైడ్ స్ట్రైకర్స్- సిడ్నీ థండర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన అడిలైడ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. క్రిస్ లిన్ 36 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కొలిన్ డీ గ్రాండ్‌హోమ్ 33 పరుగులు చేశాడు. సిడ్నీ థండర్స్ బౌలింగ్‌లో ఫజల్లా ఫరుఖీ 3 వికెట్లు పడగొట్టాడు. గురీందర్ సందు, డేనియల్ సామ్స్, బ్రెండన్ డోగ్గెట్‌లు తలా 2 వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సిడ్నీ థండర్స్ జట్టు 5.5 ఓవర్లలో కేవలం 15 పరుగులకే ఆలౌటైంది. అలెక్స్ హేల్స్, రిలీ రొసౌ, డేనియల్ సామ్స్ వంటి స్టార్లు ఉన్నప్పటికీ అతి తక్కువ పరుగులకే కుప్పకూలింది. అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలర్ హెన్రీ థోర్టన్ 2.5 ఓవర్లు వేసి 3 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అతడితో పాటు వెస్ అగర్ 4 వికెట్లతో రాణించాడు. స్ట్రైకర్స్ బౌలర్ల ధాటికి థండర్స్ జట్టులో ఐదుగురు డకౌట్ అయ్యారు. ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిటికు పరిమితమయ్యారు.
ఈ ప్రదర్శనతో బిగ్ బాష్ టోర్నీలోనే అత్యంత చెత్త రికార్డును సిడ్నీ థండర్స్ జట్టు తన ఖాతాలో వేసుకుంది. ఈ టోర్నీలోనే అత్యంత తక్కువ స్కోరుకే ఆలౌటైన జట్టుగా నిలిచింది. అంతేకాక పవర్ ప్లే కూడా పూర్తికాకముందే ఆలౌటైన జట్టుగా మరో చెత్త రికార్డును నెలకొల్పింది. టీ20 క్రికెట్ చరిత్రలో సీనియర్ విభాగంలో సిడ్నీ థండర్స్‌దే అత్యల్ప స్కోరుగా ఉంది. అంతకముందు చెక్ రిపబ్లిక్‌తో మ్యాచ్‌లో టర్కీ 21 పరుగులకే ఆలౌటైంది. ఇప్పటివరకు ఇదే అత్యల్ప స్కోరు కాగా.. తాజాగా సిడ్నీ థండర్స్ ఆ రికార్డును బద్దలు కొట్టింది.