Watch Video: మైదానంలో విరాట్ కోహ్లీ ఎంత దూకుడుగా ఉంటాడో మనందరికీ తెలిసిందే. ప్రత్యర్థి స్లెడ్జింగ్ చేస్తూ అంతే దీటుగా తనూ స్లెడ్జింగ్ చేసేవాడు. అయితే కొన్నాళ్లుగా కోహ్లీలో ఆ దూకుడు తగ్గింది. అయితే భారత్- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో అభిమానులకు మళ్లీ పాత కోహ్లీ కనిపించాడు. ప్రత్యర్ధి బ్యాటర్ లిటన్ దాస్ కు అతని తీరులోనే సమాాధానం చెప్పాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పటిష్టమైన స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 404 పరుగులు చేయగా.. బంగ్లా 150 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్ రెండో రోజు ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య చిన్న వాగ్వివాదం జరిగింది. కొన్ని స్లెడ్జింగ్ ఘటనలు జరిగాయి. భారత పేసర్ మహమ్మద్ సిరాజ్, బంగ్లా బ్యాటర్ లిటన్ దాస్ మధ్య జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే...
కోహ్లీతో పెట్టుకోవద్దు
తొలి టెస్ట్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. చివరి సెషన్ లో బంగ్లాదేశ్ 14వ ఓవర్ జరుగుతున్నప్పుడు సిరాజ్- లిటన్ దాస్ మధ్య ఈ ఘటన జరిగింది. అప్పటికి లిటన్ 24 పరుగులతో ఆడుతున్నాడు. 14వ ఓవర్ తొలి బంతి వేసిన సిరాజ్ లిటన్ దాస్ దగ్గరకు వచ్చి ఏదో అన్నాడు. దానికి లిటన్ నాకేమీ వినిపించట్లేదు అన్నట్లుగా చెవి దగ్గర చేతిని పెట్టుకుని సంజ్ఞ చేస్తూ సిరాజ్ మీదకు వచ్చాడు. అంపైర్ కలగజేసుకుని సిరాజ్ ను వెనక్కు పంపాడు. ఆ తర్వాత బంతిని వికెట్ల మీదకు ఆడుకున్న లిటన్ దాస్ ఔటయ్యాడు. వెంటనే సిరాజ్ సంబరాలు చేసుకున్నాడు. కోహ్లీ కూడా అతనికి జతకలిశాడు. కోహ్లీ, లిటన్ దాస్ చేసినట్లే చేశాడు. చెవి దగ్గర చేయి పెట్టుకుని వెళ్లమన్నట్లుగా సైగ చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో అభిమానులు కోహ్లీతో పెట్టుకోవద్దంటూ కామెంట్లు చేస్తున్నారు.
ముగిసిన మూడో రోజు ఆట
తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. బంగ్లా ముందు 512 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. భారత్ రెండో ఇన్నింగ్సులో శుభ్ మన్ గిల్, చతేశ్వర్ పుజారాలు సెంచరీలు చేశారు. 2 వికెట్లకు 258 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. ప్రస్తుతం మూడో రోజు ఆట ముగిసేసరికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. గెలవాలంటే ఇంకా ఆ జట్టు 471 పరుగులు చేయాలి.