IND vs BAN, 1st Test:


ఛటోగ్రామ్‌ టెస్టులో టీమ్‌ఇండియా దూసుకెళ్తోంది! విజయానికి అత్యంత వేగంగా చేరువవుతోంది. అద్భుతం జరిగితే తప్ప బంగ్లాదేశ్ పరాజయం నుంచి తప్పించుకోలేదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో భారత ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మూడో రోజు రాహుల్‌ సేన 258/2 వద్ద రెండో ఇన్నింగ్స్‌ డిక్లర్‌ చేసింది. 513 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. ఆట ముగిసే సరికి ఆతిథ్య జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. జకీర్‌ హసన్‌ (17 బ్యాటింగ్‌; 30 బంతుల్లో 3x4), నజ్ముల్‌ హసన్ శాంతో (25 బ్యాటింగ్‌; 42 బంతుల్లో 3x4) అజేయంగా నిలిచారు.




గిల్‌.. అదుర్స్‌!


బంగ్లాదేశ్‌ను 150 పరుగులకే కుప్పకూల్చిన భారత్‌ వెంటనే రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (23), శుభ్‌మన్‌ గిల్‌ శుభారంభం అందించారు. మొదటి వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన 22.4వ బంతికి తైజుల్‌ ఇస్లామ్‌కు రాహుల్‌ క్యాచ్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి గిల్‌ రెచ్చిపోయాడు. చక్కని బంతుల్ని డిఫెండ్‌ చేస్తూ దొరికిన వాటిని వేటాడాడు. బౌలర్లను కాచుకుంటూనే చక్కని బౌండరీలు, సిక్సర్లు బాదేశాడు. కేవలం 84 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. డ్రింక్స్‌ తర్వాత తన ఇన్నింగ్సులో మరింత  దూకుడు మొదలైంది. భారీ షాట్లు బాదాడు. తేనీటి విరామం ముగిసిన వెంటనే సెంచరీ సాధించాడు. ఇందుకు 147 బంతులు తీసుకున్నాడు. రెండో వికెట్‌కు పుజారాతో 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అతడిని మెహదీ హసన్‌ ఔట్‌ చేశాడు.


51 ఇన్నింగ్సుల తర్వాత 100


గిల్‌ ఔటయ్యాక విరాట్‌ కోహ్లీ (19*) క్రీజులోకి వచ్చాడు. ఇప్పటికే 87 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న పుజారా వేగం పెంచాడు. టీమ్‌ఇండియా యాజమాన్యం డిక్లేర్‌ చేస్తుందన్న సంకేతాలతో బౌండరీలు బాదాడు. తన సహజ శైలికి భిన్నంగా దూకుడు ప్రదర్శించాడు. విరాట్‌తో కలిసి 48 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 130 బంతుల్లో సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతడు 51 ఇన్నింగ్సుల శతకం అందుకున్నాడు. జట్టు స్కోరు 258/2 వద్ద టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయగా ఆట ముగిసే సరికి బంగ్లా 42/0తో నిలిచింది. ఉదయం ఎక్కువ వికెట్లు పడగొడితే శనివారం సాయంత్రానికి బంగ్లా ఆలౌట్‌ అయ్యే అవకాశం ఉంది.