IND vs BAN 1st Test:
గిల్, పుజారా శతకాలు
బంగ్లాదేశ్‌ను 150 పరుగులకే కుప్పకూల్చిన భారత్ వెంటనే రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (23), శుభ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. మొదటి వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఖలీల్ అహ్మద్ వేసిన 22.4వ బంతికి తైజుల్ ఇస్లామ్‌కు రాహుల్ క్యాచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి గిల్ రెచ్చిపోయాడు. చక్కని బంతుల్ని డిఫెండ్ చేస్తూ దొరికిన వాటిని వేటాడాడు. బౌలర్లను కాచుకుంటూనే చక్కని బౌండరీలు, సిక్సర్లు బాదేశాడు. కేవలం 84 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. డ్రింక్స్ తర్వాత తన ఇన్నింగ్సులో మరింత దూకుడు మొదలైంది. భారీ షాట్లు బాదాడు. తేనీటి విరామం ముగిసిన వెంటనే సెంచరీ సాధించాడు. ఇందుకు 147 బంతులు తీసుకున్నాడు. రెండో వికెట్‌కు పుజారాతో 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అతడిని మెహదీ హసన్ ఔట్ చేశాడు.
ఆ తర్వాత పుజారా గేర్ మార్చాడు. అర్ధశతకం తర్వాత వేగంగా శతకం దిశగా వచ్చాడు. 130 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు. పుజారా శతకం పూర్తయిన వెంటనే కెప్టెన్ రాహుల్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు.
తొలి ఇన్నింగ్స్
మొదట తొలి ఇన్నింగ్సులో టీమిండియా 404 పరుగులు చేసింది. పుజారా (90), శ్రేయస్ అయ్యర్ (84), అశ్విన్ (58), కుల్దీప్ (40) పరుగులతో రాణించారు. ఆ తర్వాత భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌటైంది. కుల్దీప్ 5 వికెట్లతో తన కెరీర్లోనే అత్యుత్తమ అనదగ్గ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మహ్మద్ సిరాజ్ 3 కీలక వికెట్లు తీశాడు. ఉమేష యాదవ్, అక్షర్ పటేల్ లు తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.