IND vs BAN 1st Test: భారత్- బంగ్లాదేశ్ మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్సులో లంచ్ సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్లు ఆచితూచి ఆడుతున్నారు. కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 23 నాటౌట్), శుభ్ మన్ గిల్ (47 బంతుల్లో 15 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 290 పరుగుల ఆధిక్యంలో ఉంది.
తొలి ఇన్నింగ్స్
మొదట తొలి ఇన్నింగ్సులో టీమిండియా 404 పరుగులు చేసింది. పుజారా (90), శ్రేయస్ అయ్యర్ (84), అశ్విన్ (58), కుల్దీప్ (40) పరుగులతో రాణించారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాను భారత బౌలర్లు చురకత్తుల్లాంటి బంతులేసి బంగ్లా టైగర్స్‌ను వణికించారు. పరుగుల ఖాతా తెరవకముందే నజ్ముల్ హుస్సేన్ (0)ను మహ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. మరో ఓపెనర్ జాకీర్ హుస్సేన్ (20)నూ అతడే పెవిలియన్ పంపించాడు. మరికాసేపటికే లిటన్ దాస్ (24)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. మధ్యలో ఉమేశ్ యాదవ్.. యాసిర్ అలీ (4)ని ఔట్ చేశాడు. అతడి తర్వాత కుల్‌దీప్ యాదవ్ చెలరేగాడు. అతడు వేగంగా వేయడం లేదన్న కంప్లైంట్ ఉండేది. విచిత్రంగా ఈసారి కీపర్ రిషభ్ పంత్ అతడిని నెమ్మదిగా బంతులేయమని ప్రోత్సహించాడు. పిచ్, కండిషన్స్‌ను ఉపయోగించుకున్న మణికట్టు స్పిన్నర్ ముష్ఫికర్ రహీమ్ (28), షకిబ్ అల్ హసన్ (3), నురుల్ హసన్ (16), తైజుల్ ఇస్లామ్ (16)ను పెవిలియన్ పంపించాడు. దాంతో 44 ఓవర్లకు బంగ్లా 133/8తో నిలిచింది.
8 వికెట్లకు 133 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన బంగ్లా 150 పరుగులకు ఆలౌటైంది. ఖలీద్ అహ్మద్ నాటౌట్ గా నిలిచాడు. ఆ 2 వికెట్లను కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లు తీశారు. 28 పరుగులు చేసిన ముష్ఫికర్ రహీం బంగ్లా ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్.
మొదటి ఇన్నింగ్సులో 404 పరుగులు చేసిన టీమిండియా ప్రస్తుతం 254 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బౌలర్లలో కుల్దీప్ 5 వికెట్లతో రాణించాడు. మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అక్షర్ పటేల్, ఉమేష్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు. బంగ్లాకు టీమిండియా ఫాలో ఆన్ ఇవ్వలేదు.