BCCI Warning to Kohli: ఆసియా కప్‌కు ముందు  టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి  బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.  బోర్డుతో కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లు నిబంధనలను  ఉల్లంఘించరాదని హెచ్చరించింది.  ఇటీవలే కర్నాటకలోని అలూరులో టీమిండియా ఆటగాళ్లకు నిర్వహించిన ‘యో యో టెస్టు’లో 17.2 స్కోరు  సాధించిన ఆనందంలో కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా  అందుకు సంబంధించిన ఫోటోతో పాటు  యో యో స్కోరును కూడా బహిర్గతపరిచాడు. ఇదే ఇప్పుడు బీసీసీఐ ఆగ్రహానికి కారణమైంది. 


త్వరలో మొదలుకాబోయే ఆసియా కప్‌కు ముందు టీమిండియా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఎ)లో  ప్రత్యేక శిక్షణా శిభిరాన్ని ఏర్పాటుచేసిన బీసీసీఐ.. ఇందులో భాగంగానే గురువారం క్రికెటర్లకు యో యో టెస్టును నిర్వహించింది. ఐర్లాండ్ పర్యటనలో ఉన్న బుమ్రా, సంజూ శాంసన్, తిలక్ వర్మ,  ప్రసిధ్ కృష్ణ వంటి ఆటగాళ్లు మినహా దాదాపు ఆసియా  కప్‌లో చోటు దక్కించుకున్న ఆటగాళ్లంతా ఈ పరీక్షకు హాజరయ్యారు. అయితే   యో యో టెస్టు ముగిసిన తర్వాత కోహ్లీ చేసిన పని బీసీసీఐకి కోపం తెప్పించింది.  జట్టుకు సంబంధించిన అంతర్గత విషయాలను  ఆటగాళ్లు బయటకు వెళ్లడించరాదని, సోషల్ మీడియాలో కూడా పంచుకోకూడదని  కోహ్లీకి చెప్పినట్టు తెలుస్తున్నది. 


వాస్తవానికి ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో బోర్డు పెద్దలు కాస్త కటువుగానే వ్యవహరిస్తున్నారు. గతంలో  కొంతమంది ఆటగాళ్లు ఫిట్నెస్ లేకున్నా   మ్యాచ్‌లు ఆడారని,  పలువురు ఫిట్నెస్  కోసం ఇంజెక్షన్లు తీసుకుంటారనీ గతంలో సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ చేతన్ శర్మ స్ట్రింగ్ ఆపరేషన్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇది పెద్ద దుమారం రేపింది.  ఫిట్నెస్ లేకుండానే బుమ్రాను గత సెప్టెంబర్‌లో, ఈ ఏడాది జనవరిలో జట్టులోకి తీసుకొచ్చారన్న అపప్రదను కూడా బీసీసీఐ మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో  కోహ్లీతన యో యో టెస్టు ఫలితాలను సోషల్ మీడియాలో బహిర్గతం చేయడం బీసీసీఐకి కోపం తెప్పించింది. బీసీసీఐ అపెక్స్ బాడీ అధికారులకు కోహ్లీ చేసిన పని ఎంతమాత్రమూ నచ్చలేదని, మరోసారి ఇలాంటి తప్పులు చేయొద్దని విరాట్‌ను మందలించినట్టు  గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై బీసీసీఐకి చెందిన ఓ అధికారి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. జట్టుకు సంబంధించిన రహస్య సమాచారాన్ని  సోషల్ మీడియాలో పంచుకోకూడదని తాము ఇదివరకే ఆటగాళ్లకు హెచ్చరించామని చెప్పారు.  ఆటగాళ్లు తమ ట్రైనింగ్ ఫోటోలను షేర్ చేసుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదని, కానీ  యో యో టెస్టు స్కోరు వివరాలు మాత్రం వెల్లడించకూడదని, అది బోర్డుతో ఉన్న కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధమని  హెచ్చరించారు.  


 






గురువారం యో యో టెస్టు ముగిశాక కోహ్లీ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో 'కోన్స్‌ మధ్య నిర్వహించిన యోయో టెస్టును 17.2 స్కోర్‌తో ముగించినప్పుడు ఉండే ఆనందం ఇదీ' అని పోస్ట్ చేశాడు. తన సిక్స్‌ ప్యాక్‌ దేహంతో తీసుకున్న చిత్రాన్ని ఇందుకు జత చేశాడు. ఇదే  బీసీసీఐ కోపానికి కారణమైంది. 


ఆసియా కప్‌కు భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమి, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ప్రసిద్ధ్‌ కృష్ణ


రిజర్వు ఆటగాడు: సంజూ శాంసన్‌































ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial