How To Book World Cup 2023 Tickets Online: క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐసీసీ ప్రపంచ కప్ టిక్కెట్లు ఎక్కడ కొనుగోలు చేయవచ్చో కోసం బీసీసీఐ వెల్లడించింది. భారత్‌లో జరగనున్న ఈ ప్రపంచకప్ టికెట్లను బుక్‌మై షోలో కొనుగోలు చేయవచ్చు.


రాబోయే ప్రపంచ కప్ కోసం ఆగస్ట్ 24వ తేదీ నుంచి టిక్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు 24వ తేదీన సాయంత్రం ఆరు గంటల నుంచి ఆన్‌లైన్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. వరల్డ్ కప్ మ్యాచ్‌లతో పాటు అభిమానులు వార్మప్ మ్యాచ్‌ల కోసం కూడా ఆన్‌లైన్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.


మాస్టర్ కార్డు వినియోగదారులకు ముందే...
మాస్టర్ కార్డు వినియోగదారులకు ఎక్స్‌క్లూజివ్‌గా ప్రీ సేల్ నిర్వహించనున్నారు. వీరు నేటి (అక్టోబర్ 24వ తేదీ) సాయంత్రం ఆరు గంటల నుంచి భారత్ ఆడని ఈవెంట్ మ్యాచ్‌లకి టికెట్లు ఓపెన్ చేయనున్నారు. అలాగే భారత్ ఆడే మ్యాచ్‌లకు ప్రీ సేల్ ఆగస్టు 29వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం కానుంది. సెమీ ఫైనల్, ఫైనల్స్‌కు సంబంధించిన ప్రీ సేల్స్ సెప్టెంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.


మరి మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి?
అన్ని మ్యాచ్‌ల టికెట్లను మాస్టర్ కార్డ్ సేల్‌లో కాకుండా మామూలు సేల్‌లో కూడా విక్రయించనున్నారు. భారత్ ఆడని వార్మప్ మ్యాచ్‌లు, భారత్ ఆడని ఈవెంట్ మ్యాచ్‌ల టికెట్ల బుకింగ్ ఆగస్టు 25వ తేదీన ప్రారంభం కానుంది. గువాహటి, త్రివేండ్రం స్టేడియాల్లో భారత్ ఆడే మ్యాచ్‌లకు సంబంధించిన సేల్ ఆగస్టు 30వ తేదీన ప్రారంభం కానున్నాయి. అక్కడి నుంచి భారత్ మ్యాచ్‌లు ఆడే మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను రోజుకి ఒకటి లేదా రెండు వేదికలకు విడుదల చేస్తారు. సెప్టెంబర్ 15వ తేదీన సెమీ ఫైనల్స్, ఫైనల్స్ టికెట్ల బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ టికెట్లన్నీ ఆయా తేదీల్లో రాత్రి 8 గంటలకు ఓపెన్ అవుతాయి.


ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ఏమిటి?
ప్రపంచ కప్ 2023లో మొత్తం 58 మ్యాచ్‌లు ఆడనున్నాయి. దీనికి ముందు 10 వార్మప్ మ్యాచ్‌లు ఉంటాయి. ప్రపంచ కప్ 2023 భారతదేశంలోని 12 వేర్వేరు మైదానాల్లో జరుగుతుంది. భారత జట్టు తన ప్రపంచకప్ పోటీని ఆస్ట్రేలియాతో ప్రారంభించనుంది. అక్టోబరు 8వ తేదీన చెన్నైలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా అక్టోబర్ 14వ తేదీన భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.


మరోవైపు భారత్, ఐర్లాండ్‌ టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో ఈ మ్యాచ్‌ జరగలేదు. డబ్లిన్‌ నగరంలో ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో టాస్‌ కూడా పడకుండానే ఆట రద్దు అయింది. మ్యాచ్‌ నిర్వహించేందుకు ఆఖరి వరకు నిర్వాహకులు ఎంతో ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు అస్సలు ఫలించలేదు. దీంతో అభిమానులు కూడా ఎంతో నిరాశగా స్టేడియం వీడారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial