BCCI: ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఆగస్టు రెండో వారం వరకూ అక్కడే ఉండనుంది. ఆగస్టు 13తో విండీస్ తో ఆఖరి టీ20 ముగిసిన తర్వాత  భారత్ కు బిజీ షెడ్యూల్ ఉంది.  ఐర్లాండ్ తో మూడు టీ20లు ఆడబోయే  టీమిండియా.. ఆ తర్వాతే ఆసియా కప్ ఆడేందుకు శ్రీలంకకు వెళ్లనుంది.  ఇక ఆసియా కప్ ముగిసిన తర్వాత సెప్టెంబర్ లో స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో  వన్డే సిరీస్ ఆడేందుకు బీసీసీఐ పచ్చజెండా ఊపింది. 


ఆస్ట్రేలియాతో రెండు సిరీస్ లు.. 


సెప్టెంబర్ లో భారత పర్యటనకు రానున్న ఆసీస్.. ఈ నెలలో వరల్డ్ కప్ కు ముందు మూడు వన్డేలు ఆడనుంది.   ఇరు జట్లకూ వన్డే ప్రపంచకప్ కు ముందు ఇవి సన్నాహకాలుగా ఉండనున్నాయి.  ఇవి ముగిసిన తర్వాత వరల్డ్ కప్ లో కూడా  ఈ రెండు జట్లు  అక్టోబర్ 8న తలపడనున్నాయి. రెండు జట్ల  వరల్డ్ కప్ వేట ఈ మ్యాచ్ తోనే మొదలుకానుంది.   అయితే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత డిసెంబర్ లో  మరోమారు భారత జట్టు కంగారూలతో తలపడునుంది.  కానీ ఈసారి  వన్డేలు కాదు.. పొట్టి ఫార్మాట్ లో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ జరుగనుందని బీసీసీఐ సెక్రటరీ జై షా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ చెప్పారు. శుక్రవారం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ తర్వాత ఆయన  ఈ విషయాలు వెల్లడించారు. అయితే  ఆస్ట్రేలియా సిరీస్ లకు సంబంధించిన  షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. మొత్తంగా  సెప్టెంబర్ - డిసెంబర్ మధ్య భారత్, ఆసీస్ లు పది మ్యాచ్ ల దాకా ఆడనున్నాయి. 


జనవరిలో అఫ్గాన్ తో.. 


గత నెల  అఫ్గానిస్తాన్ తో స్వదేశంలో భారత జట్టు మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆడాల్సి ఉన్నా ఆటగాళ్ల తీరిక లేని షెడ్యూల్ కారణంగా  ఈ సిరీస్ వాయిదాపడింది. సెప్టెంబర్ లో అయినా ఈ సిరీస్ ఉండొచ్చని వార్తలు వచ్చాయి.  కానీ అఫ్గాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ), బీసీసీఐ  పరస్పర ఒప్పందంతో ఈ సిరీస్ ను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్నట్టు బోర్డు వర్గాలు  తెలిపాయి. 


 






మీడియా హక్కుల వేలం అప్పుడే.. 


భారత క్రికెట్ జట్టు ఆడబోయే ద్వైపాక్షిక  మ్యాచ్ లకు ప్రసారదారుగా  ఉండేందుకు గాను  కొత్త  బ్రాడ్కాస్టర్ ను వెతికేపనిలో పడ్డ బీసీసీఐ.. ఆగస్టు చివరివారంలో తేల్చనున్నట్టు  సమాచారం. ఇదే విషయమై జై షా మాట్లాడుతూ.. ‘బీసీసీఐ కొత్త మీడియా రైట్స్ డీల్ ఆగస్టు చివరి వారంలో జరుగనుంది. ఆస్ట్రేలియాతో జరుగబోయే వన్డే సిరీస్ కు ముందునుంచి  మొదలవుతుంది..’అని తెలిపాడు. 2018 నుంచి ఈ ఏడాది మార్చి వరకూ  ‘స్టార్’ సంస్థ భారత జట్టుకు  బ్రాడ్కాస్టర్ గా ఉండేది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ, ఆసీస్ తో వన్డే సిరీస్ తర్వాత అది ముగిసింది. 


















Join Us on Telegram: https://t.me/abpdesamofficial