Jay Shah on WPL: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మహిళల క్రికెట్ లో విప్లవాత్మక మార్పులు తెస్తుందని.. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) కార్యదర్శి జై షా అన్నారు. ఐపీఎల్ లాగే డబ్ల్యూపీఎల్ కూడా ఇతర క్రీడలకు ఒక టెంప్లేట్ లా ఉంటుందని అన్నారు.
నిన్న (సోమవారం) డబ్ల్యూపీఎల్ ప్రారంభ ఎడిషన్ వేలం విజయవంతంగా జరిగింది. ఈ సీజన్ మార్చి 4 నుంచి ప్రారంభమై 26 వరకు జరుగుతుంది. మొత్తం 5 జట్లు ఈ టోర్నీలో పాల్గొనబోతున్నాయి. వేలం ముగిసిన తర్వాత బీసీసీఐ సెక్రటరీ జై షా డబ్ల్యూపీఎల్ గురించి మాట్లాడారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మనం మహిళల క్రికెట్ ను చూసే విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోంది. ఈ వేలం చాలామంది భావి మహిళా ప్రతిభావంతులకు తమ నైపుణ్యాలను పెద్ద వేదికలపై ప్రదర్శించే అవకాశం ఇస్తుంది. అలాగే యువ వర్ధమాన క్రికెటర్లు ఈ వేదికపైకి రావడానికి అవకాశం ఇచ్చింది. ఈ లీగ్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల నుంచి ఆదరణ ఉంది. లీగ్ పరిపక్వత చెందుతున్నకొద్ది ఈ ఆదరణ పెరుగుతూనే ఉంటుంది. డబ్ల్యూపీఎల్ ఇతర క్రీడలు అనుసరించడానికి ఒక టెంప్లేట్ ను సెట్ చేస్తుంది. ఐపీఎల్ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. 2008 తర్వాత ఇతర క్రీడల్లోనూ లీగ్ లు పెరిగాయి. అలాగే డబ్ల్యూపీఎల్ తర్వాత ఇదే జరుగుతుంది. అని జై షా అన్నారు.
భారత్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా క్రికెటర్లకు వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి డబ్ల్యూపీఎల్ ఒక వేదిక అవుతుందని జై షా అన్నారు. అలాగే తర్వాతి తరం అమ్మాయిలు క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోవడానికి డబ్ల్యూపీఎల్ సహాయపడుతుందని తెలిపారు. ఇంకా బంతి పడకుండానే డబ్ల్యూపీఎల్ అతిపెద్ద స్పోర్టింగ్ లీగ్ అయ్యింది. ఇప్పటి క్రీడలలో మహిళా క్రికెట్ బాగా స్థిరపడడానికి ఇది దోహదం చేస్తుంది. అని జై షా అన్నారు.
వేలం వివరాలు
మహిళల ఐపీఎల్ మొదటి సీజన్ వేలం ముంబైలో ఫిబ్రవరి 13వ తేదీన జరిగింది. ఈ వేలంలో ప్రపంచంలో ఉన్న అన్ని క్రికెట్ జట్ల నుంచి 448 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. ఐదు ఫ్రాంచైజీలకు 90 మంది క్రికెటర్లను మాత్రమే ఎంపిక చేసుకునే ఆప్షన్ ఉంది.
ఒక్కో జట్టుకు రూ.12 కోట్ల బడ్జెట్‌ను ఇచ్చారు. అన్‌క్యాప్ట్ క్రికెటర్ల బేస్ ప్రైస్ రూ.10 లక్షలు, రూ.20 లక్షలుగా ఉంది. ఇక క్యాప్డ్ క్రికెటర్లకు మాత్రం రూ.30 లక్షలు, రూ.40 లక్షలు, రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌ను నిర్ణయించారు.