BCCI:


ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ గెలిచేందుకు బీసీసీఐ కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. దేశవాళీ క్రికెట్లో అనుభవం సాధించిన కుర్రాళ్లనే జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని ఆదేశించింది. గాయపడ్డ క్రికెటర్లు యోయో టెస్టుతో పాటు డెక్సా పరీక్షలో నెగ్గితేనే పునరాగమనం చేస్తారని వెల్లడించింది. ఆటగాళ్ల పని భారాన్ని పర్యవేక్షించేందుకు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలతో కలిసి పనిచేయాలని ఎన్‌సీఏకు సూచించింది. 20 మంది ఆటగాళ్లతో కోర్‌ టీమ్ రెడీ చేయనుంది.


టీమ్‌ఇండియా 2011లో చివరిసారి ఐసీసీ ప్రపంచకప్‌ గెలిచింది. 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ సొంతం చేసుకుంది. అప్పట్నుంచి ఎంత ప్రయత్నించినా ఏ ఫార్మాట్లోనూ ఐసీసీ ట్రోఫీ అందుకోలేదు. ఆఖరి వరకు వచ్చి బోల్తా పడుతోంది. చివరి రెండేళ్ల ప్రదర్శన మరీ ఘోరం. దుబాయ్‌లో జరిగిన ఆసియాకప్‌, టీ20 ప్రపంచకప్పుల్లో నాకౌట్‌కు చేరుకోనేలేదు. ఆస్ట్రేలియాలో నిర్వహించిన తాజా టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఆంగ్లేయుల చేతిలో అవమానకర రీతిలో పరాజయం చవిచూసింది. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీసు చేజార్చుకోవడం దుమారమే రేపింది. భారత జట్టు ప్రదర్శనపై సమీక్షించాలని చాలా రోజులుగా భావించిన బీసీసీఐ చివరికి జనవరి 1న నిర్వహించింది.


'టీమ్‌ఇండియా ప్రదర్శనపై ముంబయిలో బీసీసీఐ నిర్వహించిన సమీక్ష ముగిసింది. బోర్డు అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జే షా, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, ఎన్‌సీఏ అధినేత వీవీఎస్‌ లక్ష్మణ్, చీఫ్ సెలక్టర్‌ చేతన్ శర్మ ఇందులో పాల్గొన్నారు' అని బీసీసీఐ ప్రకటనలో తెలిపింది. 'సమీక్ష నిర్మాణాత్మకంగా సాగింది. టీమ్‌ఇండియా గత ప్రదర్శన, భవిష్యత్తు టోర్నీలు, ప్రపంచకప్‌, టెస్టు ఛాంపియన్‌షిప్‌ గురించి చర్చించాం. ఐపీఎల్‌కు ఇబ్బంది లేకుండా అంతర్జాతీయ క్రికెట్‌పై ఫోకస్‌ చేస్తాం' అని వెల్లడించింది.


సమీక్షలో బీసీసీఐ కొన్ని సూచనలు చేసింది. ఇకపై జాతీయ జట్టుకు ఎంపికవ్వాలంటే ఆటగాళ్లు కచ్చితంగా దేశవాళీ క్రికెట్‌ ఆడాల్సి ఉంటుంది. వీలైనన్ని ఎక్కువ సీజన్లు ఆడిన వారికే అవకాశాలు ఇవ్వాలని చెప్పింది. క్రికెటర్ల ఎంపికకు యోయోతో పాటు డెక్సా టెస్టును ప్రామాణికంగా తీసుకుంటారు. సెంట్రల్‌ పూల్‌లో ఉన్న ఆటగాళ్లకు దశల వారీగా అమలు చేస్తారు. భవిష్యత్తులో ఎక్కువ అంతర్జాతీయ మ్యాచులు ఉండటంతో ఐపీఎల్‌ ఫ్రాంచైజీలతో కలిసి ఎన్‌సీఏ పనిచేయాల్సి ఉంటుంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ప్రాబబుల్స్‌లో ఉండే క్రికెటర్ల పనిభారం పర్యవేక్షించాలి. అక్టోబర్లో మెగా టోర్నీకి ముందు టీమ్‌ఇండియా 35 వన్డేలు ఆడుతుంది. ఇందుకోసం 20 మందిని ఎంపిక చేసి రొటేట్‌ చేయాలని నిర్ణయించుకుంది. వారితో కోర్ టీమ్‌ రూపొందించనుంది. రాహుల్‌ ద్రవిడ్‌నే టీ20 కోచ్‌గా కొనసాగించనుంది.