Rishabh Pant Accident: దిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ (డీడీసీఏ) డైరెక్టర్ శ్యామ్ శర్మ ఆసుపత్రితో చికిత్స పొందుతున్న రిషభ్ పంత్ ను పరామర్శించారు. అయితే పంత్ ను చూసేందుకు తరలివస్తున్న అభిమానులపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. 'పంత్ ను కలవడానికి వెళ్లే వారు ఇన్ ఫెక్షన్ కు గురయ్యే అవకాశం ఉంది. అలానే వారి వలన పంత్ కు కూడా ఇబ్బంది కలగవచ్చు' అని ఆయన అన్నారు.
శ్యామ్ శర్మ డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆసుపత్రికి చేరుకుని క్రికెటర్ రిషబ్ పంత్‌ను కలుసుకున్నారు. ప్రస్తుతం రిషభ్ పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. వేగంగా కోలుకుంటున్నాడని శ్యామ్ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. 'దిల్లీ మరియు జిల్లా క్రికెట్ అసోసియేషన్ బృందం పంత్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆసుపత్రికి వెళ్తుంది. అవసరమైతే మేం అతన్ని దిల్లీకి తరలిస్తాం. మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్ ద్వారా అతనిని తీసుకెళతాం' అని శ్యామ్ శర్మ చెప్పారు.
ప్రమాదం ఇలా జరిగింది
ఉత్తరాఖండ్ లోని రూర్కీ వద్ద నిన్న(శుక్రవారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత ఆటగాడు రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. కారు పూర్తిగా దగ్ధమైంది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఆయన్ని కాపాడి ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఈ ప్రమాదం నుంచి పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. అతని నుదురు, వీపు, కుడికాలు వద్ద గాయాలయ్యాయి.
గాయాలివి
ప్రమాదంలో గాయపడిన పంత్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అతని నుదురు చిట్లడం, వీపుపైన కాలిన గాయాలు త్వరగానే నయమవుతాయి. కానీ ప్రధానంగా కుడి మోకాలి లిగ్మెంట్ స్థానభ్రంశం చెందడం మాత్రం ప్రమాదకరంగా మారింది. ఇలాంటి గాయాలు ఆటగాళ్ల కెరీర్ కు మంచిదికాదు. వాస్తవానికి లిగ్మెంట్ మోకాలిని గట్టిగా పట్టుకుని, కదలికల సమయంలో మద్దతు ఇస్తుంది. స్నాయువు దెబ్బతింటే మోకాలి కీలు పట్టు కోల్పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిలబడడం, నడవడం కూడా ఇబ్బందే అవుతుంది. మాములు చికిత్సతో ఇది నయం అయితే సరే. లేకపోతే సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా కోలుకునేందుకు చాలా సమయం పట్టవచ్చు. ప్రస్తుతం రిషభ్ పంత్ భారత జట్టుకు ప్రధాన కీపర్ గా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ గాయాల నుంచి కోలుకుని అతను మాములుగా ఆడడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు.