IND vs AUS Test: ఈ ఏడాది ఫిబ్రవరి- మార్చిలో టీమిండియా ఆస్ట్రేలియాతో 4 మ్యాచ్ లు టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భారత్ కిదే ఆఖరి సిరీస్. కాబట్టి ఈ సిరీస్ టీమిండియాకు కీలకమైనది. ఈ సిరీస్ కు ముందు భారత సెలక్టర్ల ముందు కొన్ని సవాళ్లున్నాయి. ముఖ్యంగా కారు ప్రమాదంలో గాయపడిన స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ స్థానంలో ఎవరిని తీసుకోవాలనే దానిపై వారు తర్జన భర్జనలు పడుతున్నారు.


కారు ప్రమాదంలో పంత్ కు తీవ్రగాయాలు


డిసెంబర్ 30న జరిగిన కారు ప్రమాదంలో రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి నుదురు, వీపు, కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. నుదురు, వీపు గాయాలు త్వరగానే తగ్గిపోతాయి. కానీ కుడి కాలు స్నాయువు స్థాన భ్రంశం చెందినట్లు వైద్యులు తెలిపారు. పంత్ కోలుకోవడానికి కనీసం 2 నుంచి 6 నెలల సమయం పడుతుందని వారు చెప్పారు. కాబట్టి వచ్చే ఆస్ట్రేలియాతో సిరీస్ కు పంత్ అందుబాటులో ఉండడు. అతని స్థానంలో సెలక్టర్లు ఎవరిని తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతానికైతే 4 ఆప్షన్లు వారికి ఉన్నాయి. 


ఆ ఇద్దరూ ఖాయమేనా!


టెస్టుల్లో ఎప్పటినుంచో పంత్ కు బ్యాకప్ గా కేఎస్ భరత్ ఉంటున్నాడు. కాబట్టి రిషభ్ గైర్హాజరీలో ఆసీస్ తో సిరీస్ కు కచ్చితంగా భరతే ఫస్ట్ ఛాయిస్. అతను కాకుండా ఈమధ్య దేశవాళీల్లో రాణిస్తున్న ఉపేంద్ర యాదవ్ కూడా సెలక్టర్ల దృష్టిలో ఉన్నాడు. ఇతను మంచి వికెట్ కీపర్. అంతేకాకుండా బ్యాటింగ్ కూడా బాగా చేయగలడు. ఇతని యావరేజీ 45 కు పైగానే ఉంది.


ఇషాన్, సంజూలు కూడా


ఇంక వీరిద్దరూ కాకుండా వైట్ బాల్ స్పెషలిస్టులు ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ లు ఉన్నారు. వీరు ఇప్పటికే అంతర్జాతీయంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అనుభవం కలిగి ఉన్నారు. ఆ స్థాయిలో ఉండే ఒత్తిడిని తట్టుకుని ఆడగలరు. అయితే ఇటీవల రంజీ ట్రోఫీల్లో వీరు కీపింగ్ చేయకపోవడం కాస్త ఆందోళన కలిగించే అంశం. ఏదేమైనా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు వికెట్ కీపర్ గా కేఎస్ భరత్ నే సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశం ఉంది.