ICC Champion Trophy Updates: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. టైంకి కోలుకోవడం పెద్ద సవాలుగా మారిందని తెలుస్తోంది. ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఇంకా మూడువారల సమయం మాత్రమే ఉండగా, ఆలోగా బుమ్రా కోలుకోవడం అద్భుతమేనని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ముందు జాగ్రత్తగా బుమ్రాకు బ్యాకప్ గా ఇద్దరు పేసర్లను రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది. హర్షిత్ రాణా ఇంకా తెలుగు పేసర్ మహ్మద్ సిరాజ్ ను కూడా తనకు బ్యాకప్ గా రెడీ చేయనున్నారు. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో హర్షిత్ కు ఇప్పటికే స్థానం దక్కింది. దీంతో ఈ సిరీస్ లో తను ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే అనుభవం గల సిరాజ్ ను కూడా జట్టులోకి తీసుకోవాలని బోర్డు వర్గాలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అటు మరో ప్రధాన పేసర్ మహ్మద్ షమీ కూడా గాయంతోనే పునరాగమనం చేస్తున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత తను మరో అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. సో.. బ్యాకప్ గా మరో ఇద్దరు పేసర్లను రెడీ చేయాల్సి ఉందని తెలుస్తోంది.
న్యూజిలాండ్ లో చికిత్స..
మెగాటోర్నీ వరకల్లా బుమ్రా కోలుకోవాలని బోర్డు చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. న్యూజిలాండ్ కు చెందిన రోవాన్ షౌటెన్ తో ఎప్పటకప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత బుమ్రా గాయపడినప్పుడు అప్పుడు షౌటెనే బుమ్రాకు చికిత్స అందించాడు. ఇప్పుడు కూడా అతనితోనే చికిత్స అందించాలని చూస్తోంది. ఇప్పటికే బుమ్రా మెడికల్ రిపోర్టును షౌటెన్ కు బీసీసీఐ మెడికల్ టీమ్ పంపించింది. అవసరమైతే బుమ్రాను న్యూజిలాండ్ కు కూడా పంపించాలని భావిస్తోంది. అయితే షౌటెన్ సలహాపైనే ఏ నిర్ణయమైనా తీసుకోవాలసి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు దీనిపై షౌటెన్ ఏమీ చెప్పలేదని తెలుస్తోంది. ఏదేమైనా మెగాటోర్నీ వరకల్లా బుమ్రా కోలుకోవడం అయ్యే పని కాదని సమాచారం.
చాలా జాగ్రత్తలు..
ఇక బుమ్రా గాయం నుంచి కోలుకోడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. జిమ్ లో కఠినమై కసరత్తులు చేయవద్దని ఇప్పటికే డాక్టర్లు సూచించారు. అలాగే డైట్ విషయంలో కూడా మార్పులు చేసుకున్నాడు. మరోవైపు బుమ్రా గాయంపై స్పష్టత రాకపోవడంతో బోర్డు కాస్త అయోమయంలో పడిపోయింది. నిజానికి చాంపియన్స్ ట్రోఫీలో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 11 వరకు సమయం ఉంది. ఆలోగా బుమ్రా కోలుకుంటే సరి, లేకపోతే అతని స్థానంలో మరో పేసర్ ను ఎంపిక చేయక తప్పకపోవచ్చని తెలుస్తోంది. సెలెక్టర్లకు కూడా బుమ్రా పరిస్థితి గురించి ఆ రోజునే సమాచారం ఇవ్వాలని భావిస్తోంది. 2013లో దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో చివరిసారిగా భారత్.. ఈ మెగాటోర్నీని గెలిచింది. ఆ తర్వాత కోహ్లీ కెప్టెన్సీలో 2017లో ఫైనల్లో పాక్ చేతిలో పరాజయం పాలైంది.
Also Read: Tilak Varma Comments: గంభీర్ సలహాలు బాగా పని చేశాయ్.. టీ20ల్లో తన ప్రదర్శనపై తిలక్ వ్యాఖ్యలు