Ind Vs Eng T20i Series Updates: ఇండియన్ బ్యాటర్, తెలుగు కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ.. చెన్నైలో జరిగిన రెండో టీ20లో అద్భుతమైన ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్ని అందించిన సంగతి తెలిసిదే. 55 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 72 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో జట్టును విజయ పథంలో నడిపాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా లోయర్ ఆర్డర్ బ్యాటర్ల సహకారంతో తను జట్టును గెలిపించాడు. కీలక దశలో ఒత్తిడిని తట్టుకుని మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడటంతోపాటు జట్టులో తను స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గత ఇన్నింగ్స్ పై తాజాగా తిలక్ వ్యాఖ్యానించాడు. హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఇచ్చిన సలహాలు, సూచనలు తనకు అద్భుతంగా పని చేశాయని వెల్లడించాడు. కోల్ కతాతోపాటు చెన్నైలోనూ పాటించి మంచి ఫలితాలను సాధించానని పేర్కొన్నాడు. 


చివరి కంటా నిలవాలని..
తను చివరి కంటా నిలివాలని గంభీర్ ఎప్పుడూ తనతో చెబుతుండేవాడని తిలక్ గుర్తు చేసుకున్నాడు. ఓవర్ కు పది పరుగులు ఉన్నాసరే, ఎనిమిది పరుగులు సాధించాల్సి ఉన్నా సరే నిలకడగా ఆడాలని గంభీర్ చెప్పాడని తెలిపాడు. చివరి ఓవర్ కల్లా నిలిస్తే జట్టు విజయం సాధించే అవకాశం ఉంటుందని చెప్పినట్లు పేర్కొన్నాడు. ఛేజింగ్ లో అడపదడపా బౌండరీలు సాధించి, సింగిల్స్ తో స్ర్టైక్ రొటేట్ చేయమని చెప్పినట్లు తెలిపాడు. తాను చెన్నైతోపాటు కోల్ కతాలోనూ అలాగే చేసినట్లు వెల్లడించాడు. టెయిలెండర్లకు స్ట్రైక్ ఇస్తే, వారు కొన్ని పరుగులు సాధిస్తారని, దీంతో ఒత్తిడి కాస్త తగ్గుతుందనే ధోరణితో గంభీర్ చెప్పినట్లు తెలిపాడు. గంభీర్ సలహాలను తిలక్ తూచ తప్పకుండా పాటించాడు. ఓకదశలో 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో లోయర్ ఆర్డర్ బ్యాటర్ల సహకారంతో జట్టును విజయం వైపు తీసుకెళ్లాడు. చివరికంటా అజేయంగా నిలిచి భారత్ విజయం సాధించేలా చూశాడు. 


జోరు మీదున్న తిలక్..
గతేడాది సెంచరీల మీద సెంచరీలు కొట్టిన ఈ తెలుగుతేజం తాజాగా టీ20ల్లో ప్రపంచ రికార్డును కూడా నెలకొల్పాడు. తన అజేయ ఇన్నింగ్స్‌తో టీ20ల్లో కొత్త రికార్డుకు శ్రీకారం చుట్టాడు. నాటౌట్‌గా ఉంటూ, అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఫుల్ మెంబర్ స్క్వాడ్‌లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. గత నాలుగు టీ20ల్లో అజేయంగా ఉంటూ 318 పరుగులను తిలక్ వర్మ సాధించాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్‌కు చెందిన మార్క్ చాప్మన్ పేరిట ఉంది. తను 271 పరుగులతో ఈ రికార్డు నెలకొల్పగా చెన్నై ఇన్నింగ్స్‌తో తిలక్ ఈ రికార్డును బద్దలుకొట్టాడు.


గతేడాది సౌతాఫ్రికాలో జరిగిన పర్యటనలో వరుస సెంచరీలతో తిలక్ వర్మ సత్తా చాటిన సంగతి తెలిసిందే. తొలుత 56 బంతుల్లో 107 పరుగులు చేసి కెరీర్లో తొలి అంతర్జాతీయ సెంచరీ చేసిన తిలక్.. తర్వాతి మ్యాచ్ లోనూ 47 బంతుల్లోనే 120 పరుగులు చేసి తన వ్యక్తిగత స్కోరును మరింత మెరుగు పర్చుకున్నాడు. అలాగే టీ20ల్లో వరుసగా మూడు సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్ గానూ రికార్డులకెక్కాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ తో సిరీస్ లో కోల్ కతాలో జరిగిన మ్యాచ్ లో 19 పరుగులతో అజేయంగా నిలిచిన తిలక్.. శనివారం మ్యాచ్ లో 72 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. తిలక్ ఇదే జోరు చూపిస్తూ మూడో టీ20 వేదికైన రాజకోట్ లోనే భారత్ సిరీస్ సాధించే అవకాశముంది. ఐదు టీ20ల సిరీస్ లో 2-0తో టీమిండియా ఇప్పటికే ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. 


Also Read: Brook Trolling: బ్రూక్ ను ర్యాంగింగ్ చేస్తున్న భారత ఫ్యాన్స్.. చెన్నైలో వరుణ్ చేతిలో ఔట్ కావడంపై ట్రోలింగ్