Brendon McCullum About Bazball: రాజ్‌కోట్(Rajkot) టెస్టులో టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ (England) పై ఏకంగా 434 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి అయిదు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. యశస్వి జైస్వాల్ ద్వి శతక గర్జనతో బ్రిటీష్ జట్టు ముందు భారత జట్టు 556 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 557 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లాండ్ 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో 434 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో ఇంగ్లాండ్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. టెస్టులలో ఇంగ్లండ్ జట్టుకు పరుగుల పరంగా ఇది రెండో అతిపెద్ద ఓటమి. ఇంతకుముందు ఆ జట్టు 1934లో ఆస్ట్రేలియా చేతిలో 562 రన్స్ తేడాతో ఓడింది. 21వ శతాబ్దంలో బ్రిటీష్ జట్టుకు ఇదే అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం. అయితే ఈ భారీ పరాభవం వేధిస్తున్నా ఇంగ్లాండ్ మాత్రం ఓ విషయంలో వెనకడుగు వేయడం లేదు...
వెనక్కి తగ్గం
మూడో టెస్టులో భారీ పరాజయం బాధిస్తున్నా.. భారత్‌తో మిగతా మ్యాచ్‌ల్లో బజ్‌బాల్ వ్యూహాన్ని కొనసాగిస్తామని ఇంగ్లాండ్ జట్టు ప్రధాన కోచ్ మెక్‌కలమ్ అన్నాడు. తాము అనుసరిస్తున్న విధానం పట్ల విచారం లేదని చెప్పాడు. మిగిలిన మ్యాచుల్లో తాము పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌ను ఒత్తిడిలోకి నెడతామని నిర్ణయాత్మక పోరులో విజయం సాధిస్తామని స్పష్టం చేశాడు. బజ్‌బాల్‌పై బయటి వ్యక్తుల విమర్శల గురించి పట్టించుకోమని, 18 నెలల కిందటి కంటే ప్రస్తుతం తమ జట్టు బాగుందని అతడు చెప్పాడు.
స్టోక్స్ కీలక నిర్ణయం
రాంచీ(Ranchi)లో జరిగే నాలుగో టెస్టు(4th Test)లో బౌలింగ్ చేయాలని స్టోక్స్ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. మంచి పేస్ ఆల్‌రౌండరైనా స్టోక్స్‌కు గత నవంబర్‌లో మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. అప్పటి నుంచి బౌలింగ్‌కు ఇంగ్లాండ్ సారధి దూరంగా ఉంటున్నాడు. బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. ఇంగ్లండ్‌ను మళ్లీ గెలుపు బాట పట్టించేందుకు బెన్ స్టోక్స్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. స్టోక్స్ బౌలింగ్ చేస్తే ఇంగ్లండ్ జట్టులో మంచి సమతుల్యం కూడా లభిస్తుంది. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను ఆడించేందుకు అవకాశం ఉంటుంది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే మళ్లీ బౌలింగ్ చేయాలని స్టోక్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తిరిగి బౌలింగ్ ప్రారంభించడం గురించి వైద్య బృందంతో స్టోక్స్ మాట్లాడతాడని ఇంగ్లాండ్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్ తెలిపాడు. స్టోక్స్ 100 టెస్టుల కెరీర్‌లో స్టోక్స్ 197 వికెట్లు తీశాడు.
బుమ్రా లేకుండానే!
ఈనెల 23న రాంచిలో ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్‌లో బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశముంది. కొన్ని రోజులుగా వరుసగా మ్యాచ్ లు ఆడుతున్న పేసు గుర్రం బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే టీమిండియా మేనేజ్ మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ టెస్టు సిరీస్‌లో ప్రతి మ్యాచ్ ఆడినా బుమ్రా ఫిట్‌నెస్‌పై ప్రభావం పడుతుందని టీమిండియా మేనేజ్‌మెంట్ భయపడుతుందన్న వార్తలు వస్తున్నాయి. తర్వాతి మ్యాచ్‌లకు మరింత ఫిట్ గా ఉంచేందుకు తదుపరి టెస్టు నుంచి విశ్రాంతి కల్పించిందని తెలుస్తోంది. మరోవైపు గాయం కారణంగా రెండు, మూడు టెస్టులకు దూరమైన కేఎల్ రాహుల్ నాలుగో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు.