IND-ENG 4th Test: రాజ్‌కోట్‌(Rajkot) టెస్టులో టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌(England)పై ఏకంగా 434  పరుగుల తేడాతో భారీ విజయం సాధించి అయిదు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. యశస్వి జైస్వాల్‌ ద్వి శతక గర్జనతో బ్రిటీష్‌ జట్టు ముందు భారత జట్టు 556 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 557 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లాండ్‌ 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో 434 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ భారీ విజయంతో అయిదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రాకు నాలుగో టెస్ట్‌లో విశ్రాంతి ఇవ్వాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.




 

బుమ్రా లేకుండానే! 

ఈనెల 23న రాంచిలో ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్‌లో బుమ్రా(Bumrah)కు విశ్రాంతినిచ్చే అవకాశముంది. అయిదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో బుమ్రా ఇప్పటికే 17 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. రెండో టెస్టులో ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు.  కొన్ని రోజులుగా వరుసగా మ్యాచ్‌ లు ఆడుతున్న పేసు గుర్రం బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే టీమిండియా మేనేజ్ మెంట్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ టెస్టు సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌ ఆడినా బుమ్రా ఫిట్‌నెస్‌పై ప్రభావం పడుతుందని టీమిండియా మేనేజ్‌మెంట్‌ భయపడుతుందన్న వార్తలు వస్తున్నాయి. తర్వాతి మ్యాచ్‌లకు మరింత ఫిట్‌ గా ఉంచేందుకు తదుపరి టెస్టు నుంచి విశ్రాంతి కల్పించిందని తెలుస్తోంది. మరోవైపు గాయం కారణంగా రెండు, మూడు టెస్టులకు దూరమైన కేఎల్‌ రాహుల్‌ నాలుగో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. రాంచి టెస్ట్‌లో బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశముందని... రాహుల్‌  రాంచి టెస్టుకు అందుబాటులో ఉండొచ్చని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 

 

రోహిత్‌ ఏమన్నాడంటే....

ఇంగ్లాండ్‌ బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగానే ఆడి తమను ఒత్తిడిలోకి నెట్టారని రోహిత్‌ అన్నాడు. తమ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని... ప్రత్యర్థి బ్యాటర్లు బజ్‌బాల్‌తో దూకుడుగా ఆడుతున్న సమయంలోనూ ప్రశాంతంగా ఉండాలని తమ బౌలర్లకు చెప్పానని రోహిత్‌ తెలిపాడు. కానీ మూడో రోజు తమ బౌలర్లు అద్భుతంగా పుంజుకుని మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పేశారని తెలిపాడు. టెస్టు మ్యాచ్‌ ఆడుతున్నప్పుడు రెండు, మూడు రోజులపైనే దృష్టి పెట్టుద్దని... చివరి రోజు వరకు మ్యాచ్‌ను పొడిగించడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నామని హిట్‌ మ్యాన్‌ తెలిపాడు.

 

ఆకట్టుకున్న రవీంద్ర జడేజా

 

రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లోనూ కీలక పరుగులు సాధించాడు. సర్ఫరాజ్‌ నాణ్యమైన క్రికెటింగ్ షాట్లతో ఆకట్టుకున్నాడని రోహిత్‌ తెలిపాడు. ఇక సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో జైశ్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌ అద్బుతమైన ప్రదర్శన కనబరిచారని అన్నాడు. వారిద్దరూ మాకు కావాల్సిన ఆధిక్యాన్ని అందించారుని జైశ్వాల్‌ గురించి ఎంత చెప్పుకున్నా  తక్కువే. అతడొక అద్బుతం.. ఇదే విషయంపై చాలా సార్లు ఇప్పటికే చెప్పానని తెలిపాడు. యశస్వీ భవిష్యత్తులో కచ్చితంగా వరల్డ్‌క్రికెట్‌ను ఏలుతాడని హిట్‌ మ్యాన్‌ తెలిపాడు.