బంగ్లాదేశ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజే పది వికెట్లు నేలకూలాయి. పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తున్న వేళ స్పిన్నర్లు చెలరేగిపోయారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 172 పరుగులకే కుప్పకూలగా తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 55 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. అనూహ్యంగా తిరుగుతూ బౌన్స్‌ అవుతున్న బంతిని ఆడడం బ్యాటర్ల వల్ల కాలేదు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్పిన్నర్ల మాయాజాలంతో ఒక్కరోజే 15 వికెట్లు నేలకూలాయి. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 66.2 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. కివీస్ బౌలర్ల ధాటికి ఆది నుంచే బంగ్లా బ్యాటర్లు విలవిలలాడారు. 29 పరుగులకే ఓపెనర్లు మహ్మదుల్ హసన్ (14), జకీర్ హుస్సేన్ (8) వెనుదిరిగారు. కాసేపటికే మోమినల్ (5), కెప్టెన్ షాంటో (9) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన ముష్ఫికర్ (35), హోస్సేన్ (31) వికెట్లు పడకుండా అడ్డుకున్నారు. అయితే ముష్పికర్ హ్యాండ్లింగ్ ది బాల్'రూల్ తో అవుటయ్యాడు. ముష్ఫికర్‌ రహీం ఒక్కడే 35 పరుగులు చేయగా మిగిలిన బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. బంగ్లాదేశ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టడంతో బంగ్లా తొలి ఇన్నింగ్స్ లో 172 పరుగులకు ఆలౌటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్, ఫిలిప్స్ చెరో మూడు వికెట్లు, అజజ్ పటేల్ రెండు, సౌథి ఒక వికెట్ తీశారు.



 అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన న్యూజిలాండ్ తొలి రోజు ఆట ముగిసేసరికి అయిదు వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది. కాన్వాయ్ (11), లాథమ్ (4), నికోలస్ (1), విలియమ్సన్ (13) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. బ్లండెల్ డకౌటయ్యాడు. కాగా, బంగ్లా బౌలర్లలో మెహిద్ అసన్ మూడు, తైజుల్ ఇస్లామ్ రెండు వికెట్లు తీశారు. న్యూజిలాండ్ ఇంకా 117 పరుగుల వెనుకంజలో ఉంది.



 ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫీకర్ రహీమ్ విచిత్రంగా అవుటయ్యాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ముష్ఫికర్ డిఫెన్స్ ఆడిన బంతి.. వికెట్ల మీదకు రావటంతో చేతితో ముష్ఫికర్ రహీమ్ వెంటనే చేతితో అడ్డుకున్నాడు. బౌలర్ జేమీసన్ వేసిన బంతిని చేత్తో అడ్డుకోవడంతో థర్డ్ అంపైర్ హ్యాడ్లింగ్ ది బాల్‌గా అవుట్ ఇచ్చాడు. వాస్తవానికి బంతి వికెట్లకు దూరంగానే వెళ్లినా నిబంధనల ప్రకారం బాల్‌ను చేత్తో అడ్డుకోకూడదు. ముష్ఫీకర్‌ చేతితో బాల్‌ను ఆపడంతో అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ ప్రకారం ఔట్‌గా ప్రకటించారు. దీంతో రహీమ్ నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఈ అవుట్‌తో టెస్టుల్లో తొలిసారిగా హ్యాడ్లింగ్ ది బాల్‌ రూల్‌తో అవుటైన ఆటగాడిగా ముష్ఫీకర్ రహీమ్ తన పేరిట చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకూ పదిమంది ఆటగాళ్లు ఈ రకంగా ఔట్ కాగా.. 11 వ ప్లేయర్‍గా ముష్ఫికర్ రహీమ్ చేరాడు.ఈ జాబితాలో భారతజట్టు మాజీ ఆటగాడు మొహిందర్ అమర్‌నాథ్ కూడా ఉన్నాడు. 



 స్వదేశంలో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ చారిత్రాత్మక‌ విజ‌యం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్ట్‌ను బంగ్లా గెలుచుకుంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ పది వికెట్లతో మెరవడంతో 150 పరుగుల తేడాతో కివీస్‌పై బంగ్లాదేశ్‌ ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన తైజుల్‌... రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ పతనాన్ని శాసించాడు. తైజుల్‌ స్పిన్‌ మాయాజాలంతో 332 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే కుప్పకూలింది.