భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల్లో  కొత్త అధ్యక్షుడిగాబీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ శరణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ (Sanjay Singh) ఎన్నిక అవటంపై భారత స్టార్‌ రెజ్లర్లు...తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇక బరిలోకి దిగటం తన వల్ల కాదంటూ భారత స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్ (Sakshi Malik) కెరియర్‌కు వీడ్కోలు పలికింది. సంజయ్ సింగ్ ఎన్నిక జరిగిన కొద్దిసేపటికే సాక్షి మాలిక్‌ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. సంజయ్‌సింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా ఎన్నికవడాన్ని రెజ్లర్లు సాక్షి మలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే బజరంగ్‌ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి సుదీర్ఘ లేఖ రాశారు.

 

బజరంగ్‌ పునియా పద్మశ్రీ అవార్డును తిరిగివ్వడంపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆ నిర్ణయం పూర్తిగా అతడి వ్యక్తిగతమని, డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలు మాత్రం పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగాయని స్పష్టం చేసింది. బజరంగ్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా కేంద్ర మంత్రిత్వశాఖ సూచించింది. 

 

ప్రధానికి రాసిన లేఖలో ఏముందంటే....

అయితే పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి ఇస్తూ పునియా ప్రధాని రాసిన లేఖలో కీలక విషయాలు ప్రస్తావించాడు. ప్రియమైన ప్రధాని మోడీ గారికి...అంటూ లేఖను ప్రారంభించిన బజరంగ్‌ పునియా... దేశంలో రెజ్లర్ల పరిస్థితిని మీ దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు. బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఈ ఏడాది జనవరిలో మహిళా రెజ్లర్లు చేసిన ఆందోళనలో తాను నిరసనలో పాల్గొన్నానని గుర్తు చేశాడు. నెలలు గడిచినా బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంతో మళ్లీ రోడెక్కాల్సి వచ్చిందని... న్యాయం కోసం తమ పతకాలను గంగా నదిలో కలిపేద్దామనుకున్నా అతడిపై చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చిందని బజ్‌రంగ్‌ లేఖలో పేర్కొన్నాడు.

 

ఇప్పుడు రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికల ఫలితాలతో రెజ్లింగ్‌ సమాఖ్య మళ్లీ బ్రిజ్‌భూషణ్‌ చేతుల్లోకే వెళ్లిందని... ఈ ఫలితాలను భరించలేక సాక్షి మలిక్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిందని లేఖలో బజరంగ్‌ పునియా గుర్తు చేశాడు. ఇప్పుడు మేం న్యాయం కోసం ఎక్కడికెళ్లాలో అర్థం కావట్లేదని... తమకు మీ ప్రభుత్వం ఎంతో చేసిందని గుర్తు చేశాడు. 2019లో తనకు పద్మశ్రీ దక్కిందని... అర్జున, ఖేల్‌రత్న వంటి అవార్డులు కూడా వచ్చాయని అన్నాడు. మహిళా రెజ్లర్లు భద్రత లేని కారణంగా ఆటకు వీడ్కోలు పలకాల్సి వచ్చిందని... ఇది తనను కుంగదీసింని అందుకే పద్మశ్రీని మీకే తిరిగిచ్చేయాలని నిర్ణయించుకున్నానని పునియా తన లేఖలో వెల్లడించాడు. తాము ఎవరిపై పోరాడామో వారి అనూచరులే తిరిగి అధ్యక్ష పదవిలోకి రావడాన్ని సమర్థించబోమని బజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్ పేర్కొన్నారు. తాము మహిళా అధ్యక్షురాలు కావాలని డిమాండ్‌ చేశామనీ, అధ్యక్షురాలు మహిళ అయితే ఇటువంటి వేధింపులు జరిగేవి కావన్నారు. ఈ ఏడాది జనవరిలో బజరంగ్, వినేశ్, సాక్షి మాలిక్ వంటి స్టార్ రెజర్లు జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనకు నాయకత్వం వహించారు, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పలువురు రెజ్లర్ లను లైంగికంగా వేధించారని, అతనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.