Babar Azam: శ్రీలంక పర్యటనలో భాగంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో గెలుచుకున్న విషయం తెలిసిందే. శ్రీలంకను ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఓడించిన పాకిస్తాన్.. లంకపై అత్యధిక సిరీస్‌లు సొంతం చేసుకున్న జట్టుగా నిలిచింది. రెండో మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ సారథి చేసిన పనికి ఆ జట్టు అభిమానులే కాదు శ్రీలంక ఫ్యాన్స్ కూడా బాబర్ ఆజమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
రెండో టెస్టులో భాగంగా ఐదో రోజు (జులై 27) లంకను ఆలౌట్ చేసిన తర్వాత పెవిలియన్‌కు వెళ్తుండగా శ్రీలంక యువ అభిమాని ఒకరు.. ‘బాబర్.. నీ జెర్సీ నాకు గిఫ్ట్‌గా ఇవ్వవా..?’ అని అడిగాడు. దీనికి స్పందించిన బాబర్.. అభిమాని కోరికను కాదనలేకపోయాడు. తాను వేసుకున్న జెర్సీని అక్కడికక్కడే విప్పి ఆ అభిమానికి ఇచ్చాడు. దీంతో ఆ అబ్బాయి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బాబర్‌తో పాటు మరో పాకిస్తాన్ క్రికెటర్ నౌమన్ అలీ కూడా తన జెర్సీని అభిమానికి గిఫ్ట్‌గా ఇచ్చాడు.
పాకిస్తాన్ ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాక ఆ అభిమానులు జెర్సీలను అపురూపంగా చూసుకోవడమే గాక వాటితో ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అడగ్గానే అభిమానికి జెర్సీని ఇచ్చిన బాబర్ ఆజమ్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
సిరీస్ పాక్ వశం..
కొలంబో వేదికగా జరుగుతున్న పాకిస్తాన్ - శ్రీలంక రెండో టెస్టులో బాబర్ ఆజమ్ సేన ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈనెల 24న మొదలైన ఈ టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూలింది. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 134 ఓవర్లు ఆడి 576 పరుగుల భారీ స్కోరు చేసింది. పాక్ ఓపెనర్ షఫీక్ (201) డబుల్ సెంచరీతో చెలరేగాడు. అగా సల్మాన్ (132) సెంచరీ చేయడంతో పాక్ భారీ స్కోరు సాధించింది. శ్రీలంకపై ఏకంగా 410 పరుగుల భారీ ఆధిక్యాన్ని దక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక తడబడింది. నౌమన్ అలీ విజృంభణతో శ్రీలంక.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే ఆలౌట్ అయింది. అలీ ఏడు వికెట్లు తీయగా నసీమ్ షా మూడు వికెట్లు పడగొట్టాడు.
కాగా శ్రీలంకను ఆ దేశంలో ఓడించి అత్యధిక టెస్టు సిరీస్‌లు సొంతం చేసుకున్న జట్టుగా పాకిస్తాన్ కొత్త రికార్డు సృష్టించింది. లంకపై పాక్‌కు ఇది ఐదో టెస్టు సిరీస్ విజయం. గతంలో ఇంగ్లాండ్, పాకిస్తాన్‌లు నాలుగు టెస్టు సిరీస్ విజయాలతో ముందంజలో ఉండేవి. భారత జట్టు లంకపై మూడు సార్లు టెస్టు సిరీస్‌లను గెలుచుకుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial