World Cup 2023 Schedule: అక్టోబర్ - నవంబర్‌లలో భారత్  లోని పది నగరాల్లో జరుగనున్న వన్డే వరల్డ్ కప్  షెడ్యూల్‌లో భారీ మార్పులు తప్పవా..? భద్రతా కారణాల రీత్యా   అక్టోబర్ 15న జరగాల్సి ఉన్న భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌తో పాటు   టోర్నీలోని చాలా మ్యాచ్‌ల షెడ్యూల్  సవరించడానికి బీసీసీఐ, ఐసీసీ చర్చలు జరుపుతున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. 


ఇదివరకే  ప్రకటించిన షెడ్యూల్  ప్రకారం  భారత్ - పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 15న  అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉండగా అదే రోజు నుంచి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తమకు భద్రతా కారణాలు తలెత్తే అవకాశం ఉన్నదని  గుజరాత్ సెక్యూరిటీ ఏజెన్సీలు  బీసీసీఐని కోరిన విషయం తెలిసిందే.  ఈ మ్యాచ్‌ను అక్టోబర్ 14న నిర్వహించాలని  గుజరాత్ కోరుతోంది.  ఇక తాజాగా పలు ఇతర దేశాలు కూడా  తమ మ్యాచ్ షెడ్యూల్‌ను మార్చాలని బీసీసీఐతో పాటు ఐసీసీని ఆశ్రయించినట్టు తెలుస్తున్నది.  పలు దేశాలు  రెండు రోజుల గ్యాప్‌తో  మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా మరికొన్నిసార్లు ఏకంగా ఐదు నుంచి ఆరు రోజుల లాంగ్ గ్యాప్ ఉండటంపై వాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 


ఇదే విషయమై నిన్న ఢిల్లీలో వరల్డ్ కప్ మ్యాచ్‌లు నిర్వహించబోయే 12 స్టేట్ అసోసియేషన్స్‌తో సమావేశానికి హాజరైన బీసీసీఐ సెక్రటరీ జై షా  స్పందించారు. ‘కొంతమంది  సభ్యులు తమకు రెండు మ్యాచ్‌ల మధ్య  గ్యాప్  తక్కువగా ఉందని, మరికొందరు ఐదారు రోజులు గ్యాప్ ఉందని మాకు చెప్పారు.  మేం దీనిపై చర్చిస్తున్నాం. రాబోయే రెండు మూడు రోజులలో  ఈ సమస్యను పరిష్కరిస్తాం..’ అని  చెప్పాడు. 


 






ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌ను  అక్టోబర్ 14న నిర్వహిస్తే  పాక్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురుకానుంది. అక్టోబర్ 12న ఆ జట్టు  హైదరాబాద్‌లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ఆడి  ఆ తర్వాత  14న  అహ్మదాబాద్‌లో భారత్‌తో ఆడాల్సి ఉంటుంది.  మధ్యలో ఒక్కరోజు గ్యాప్‌ మాత్రమే ఉంది. దీనిపై పాకిస్తాన్ కూడా అభ్యంతరం చెప్పే అవకాశం లేకపోలేదు.  అదీగాక  అక్టోబర్ 14న ఇంగ్లాండ్ - అఫ్గానిస్తాన్, న్యూజిలాండ్ - బంగ్లాదేశ్  మ్యాచ్ కూడా జరగాల్సి ఉంది. ఇదే రోజు భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే అది   బ్రాడ్‌కాస్టర్ల మీద  ప్రభావం చూపనుంది.  ఈ సమస్యలపై త్వరలోనే ఐసీసీతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే దిశగా బీసీసీఐ అడుగులు వేస్తోంది. 


ఇక స్టేట్ అసోసియేషన్స్‌తో జరిగిన మీటింగ్‌లో  ప్రధానంగా వరల్డ్ కప్ నిర్వహించబోయే స్టేడియాలలో  పునర్నిర్మాణ పనులు ఎక్కడిదాకా వచ్చాయి..? సౌకర్యాల వసతి ఎలా ఉంది..? టికెట్ రేట్లు, వాటిని అందజేయాల్సిన విధానాలపై చర్చించినట్టు తెలుస్తున్నది.   టికెట్స్ అమ్మకాలపై ఇంకా నిర్ణయమేమీ తీసుకోలేదని  బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 









ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial