Rohit Sharma: విండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు వన్డే సిరీస్‌ను కూడా విజయంతోనే ఆరంభించింది.   గురువారం  బార్బడోస్ వేదికగా ముగిసిన తొలి వన్డేలో  115 పరుగుల లక్ష్య ఛేదనను   ఐదు వికెట్లు కోల్పోయి అందుకుంది. అయితే  భారత క్రికెట్ జట్టు సారథి, ఓపెనర్  రోహిత్ శర్మ మాత్రం ఈ మ్యచ్‌లో ఏడో స్థానంలో  బ్యాటింగ్‌కు  రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనికి గల కారణాన్ని  మ్యాచ్ ముగిశాక హిట్‌మ్యాన్ వెల్లడించాడు. 


పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో  రోహిత్ మాట్లాడుతూ.. ‘నేను  టీమిండియా తరఫున  అరంగేట్రం చేసినప్పుడు ఏడో స్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చాను.  నాకు ఆ రోజులు గుర్తొచ్చాయి.  మా ముందు తక్కువ లక్ష్యం ఉండబట్టే బ్యాటింగ్ ఆర్డర్‌లో మేం ప్రయోగాలు చేశాం.  ప్రస్తుతం టీమ్‌లో కొంతమందికి  ఇక్కడ ఆడిన అనుభవం లేదు. వాళ్లకు కూడా  అవకాశాలిచ్చేందుకే నేను నా బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకున్నా..’అని  చెప్పుకొచ్చాడు. 


ఇక బార్బడోస్ పిచ్ బౌలర్లకు బాగా సహకరించిందని  రోహిత్ చెప్పాడు. తమ బౌలర్లు విండీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారని, అది తమకు విజయాన్ని అందించిందని  తెలిపాడు. ‘అసలు పిచ్ ఇలా స్పందిస్తుందని మేం  ఊహించలేదు.  ఇక్కడ  టాస్ గెలిస్తే బౌలింగ్ చేయాలని మేం ముందుగానే  అనుకున్నాం.    బార్బడోస్ పిచ్  సీమర్లకు  స్పిన్నర్లకు సమంగా   అనుకూలించింది.  వెస్టిండీస్ జట్టును  మా బౌలర్లు తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. కుల్దీప్, జడేజాతో పాటు  ముకేశ్ కుమార్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు’ అని  రోహిత్  తెలిపాడు.


 






ఇప్పుడు ప్రయోగాలు అవసరమా..? 


తాను బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందికి రావడం.. అసలు కోహ్లీకి  బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవడం.. 115 పరుగులు  చేయడానికి భారత్ సగం వికెట్లు కోల్పోవడంపై  సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.  అసలే వన్డే వరల్డ్ కప్ ముందున్న నేపథ్యంలో  టీమ్ కూర్పును  మరింత బలంగా చేసుకోవాల్సింది పోయి ఈ టైమ్‌లో  ప్రయోగాలు అవసరమా..? అన్న అభిప్రాయాలూ వినబడుతున్నాయి.  ఇషాన్ కిషన్ - శుభ్‌మన్ గిల్‌లను ఓపెనర్లుగా బరిలోకి దింపగా వీరిలో గిల్ తన వైఫల్య  ప్రదర్శనను కొనసాగించగా.. వన్ డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా  19 పరుగులే చేసి నిష్క్రమించాడు. వరుసగా విఫలమవుతున్నా సూర్యకు అవకాశాలిస్తుండటం కూడా విమర్శలకు తావిస్తోంది.  సంజూ శాంసన్‌ను బెంచ్‌కే పరిమితం చేసి  సూర్యను ఆడిస్తుండటంపై అభిమానులు టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు బీసీసీఐపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు విండీస్‌ను 23 ఓవర్లలో  114 పరుగులకే ఆలౌట్ చేసింది.  కెప్టెన్ షై హోప్ (43) టాప్ స్కోరర్.  స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా  భారత్ తడబడింది.   22.5 ఓవర్లలో  ఐదు వికెట్లు కోల్పోయి  118 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ (52) అర్థ సెంచరీతో రాణించగా .. జడేజా (16 నాటౌట్), రోహిత్ శర్మ (12 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా విజయాన్ని ఖాయం చేశారు.  గిల్ (7), సూర్య  (19) మరోసారి విఫలమయ్యారు.  







ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial