Ashes 2023: యాషెస్ సిరీస్‌లో  డూ ఆర్ డై మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లాండ్.. ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో దూకుడు మంత్రంతో  అట్టర్ ఫ్లాఫ్ అయింది.  ఇప్పటికే యాషెస్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్.. ఈ మ్యాచ్‌లో అయినా  గెలిచి సిరీస్ కాపాడుకోవాలని చూస్తుండగా తొలి  ఇన్నింగ్స్‌లో ఆ జట్టు అత్యంత పేలవ ప్రదర్శనతో   బోల్తా కొట్టింది.  ఈ సిరీస్‌లో తొలిసారి టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌ కు వచ్చిన ఇంగ్లాండ్.. 54.4 ఓవర్లలో  283 పరుగులకే ఆలౌట్ అయింది.  హ్యారీ బ్రూక్  (91 బంతుల్లో 85, 11 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే   రాణించాడు. 


దూకుడుగానే మొదలుపెట్టినా.. 


కెన్నింగ్టన్ ఓవల్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను దూకుడుగానే మొదలుపెట్టింది.  ఎప్పటిలాగే ఓపెనర్లు   జాక్ క్రాలీ (37 బంతుల్లో 22, 3 ఫోర్లు), బెన్ డకెట్ (41 బంతుల్లో 41, 3 ఫోర్లు)  దూకుడగానే ఆడారు. తొలి వికెట్‌కు ఈ ఇద్దరూ  12 ఓవర్లలోనే 62 పరుగులు జోడించారు. కానీ మిచెల్ మార్ష్.. డకెట్‌ను ఔట్ చేయడంతో  ఇంగ్లాండ్ తడబడింది.   డకెట్ తర్వాత క్రాలీ కూడా కమిన్స్ బౌలింగ్‌లో స్లిప్స్‌లో  స్మిత్‌కు క్యాచ్ ఇచ్చాడు.  జో రూట్(5)ను  హెజిల్‌వుడ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 12 ఓవర్లకు 61-‌0 గా ఉన్న ఇంగ్లాండ్ స్కోరుబోర్డు.. 15.3 ఓవర్లకు 73-3గా మారింది. 


ఆదుకున్న అలీ - బ్రూక్.. 


వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ను మోయిన్ అలీ (47 బంతుల్లో 34, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హ్యారీ బ్రూక్ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ వికెట్ల పతనాన్ని అడ్డుకోవడమే గాక ఇంగ్లాండ్ స్కోరుబోర్డును  పరుగులు పెట్టించారు.  ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 111 పరుగులు  జోడించారు.  లంచ్ తర్వాత  అలీని  స్పిన్నర్ టాడ్ మర్ఫీ  ఔట్ చేయడంతో  ఇంగ్లాండ్ వికెట్ల పతనం మళ్లీ మొదలైంది. 


చెలరేగిన స్టార్క్ 


అలీ నిష్క్రమణ తర్వాత వచ్చిన కెప్టెన్ బెన్  స్టోక్స్ (3)ను స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేశాడు.  మాంచెస్టర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుతో సెంచరీ కోల్పోయిన కీపర్ జానీ బెయిర్  స్టో (4)ను హెజిల్‌వుడ్ బౌల్డ్ చేశాడు.   కొద్దిసేపటికే  సెంచరీ దిశగా సాగుతున్న బ్రూక్‌ను కూడా  స్టార్క్ ఔట్ చేయడంతో ఇంగ్లాండ్  212 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.   ఈ క్రమంలో లీడ్స్ టెస్టు హీరోలు క్రిస్ వోక్స్ (36), మార్క్ వుడ్ (28)లు  ఇంగ్లాండ్‌ను ఆదుకున్నారు. ఈ ఇద్దరూ 8వ వికెట్‌‌కు  49 పరుగులు జోడించారు.  ఇంగ్లాండ్ స్కోరును 300 దాటించే దిశగా ఆడిన ఈ  జోడీని మరోసారి స్టార్క్ దెబ్బకొట్టాడు.  స్టార్క్ బౌలింగ్‌లో వోక్స్ ఔట్  అయ్యాడు.  వుడ్‌ను మర్ఫీ బౌల్డ్ చేశాడు.  బ్రాడ్‌ను స్టార్క్ ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 54.4 ఓవర్లలో 283 పరుగుల వద్ద ముగిసింది. 


 






వార్నర్ మళ్లీ విఫలం.. 


ఇంగ్లాండ్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన ఆస్ట్రేలియా..   చివరి సెషన్‌లో 25 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసింది. ఉస్మాన్ ఖవాజా (26 నాటౌట్), డేవిడ్ వార్నర్  (24) తొలి వికెట్‌కు 49  పరుగులు జోడించారు. కుదురుకుంటున్నట్టే కనిపించిన వార్నర్ మరోసారి విఫలమయ్యాడు.   క్రిస్ వోక్స్ వేసిన 17 వ ఓవర్లో   క్రాలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్.. ఒక వికెట్ నష్టపోయి  61 పరుగులు చేసింది.  ఖవాజాతో పాటు లబూషేన్ (2 నాటౌట్) క్రీజులో ఉన్నారు. 





ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial