Harmanpreet Kaur: బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఆ జట్టుతో ముగిసిన మూడో వన్డేలో  అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించి, వికెట్లను తన బ్యాట్‌తో  విరగ్గొట్టేందుకు యత్నించి దురుసుగా ప్రవర్తించిన  టీమిండియా  ఉమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో బీసీసీఐ మాట్లాడనుంది.  ఈ ఘటనపై బీసీసీఐ  అధ్యక్షుడు రోజర్ బిన్నీతో పాటు  నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఎ) అధ్యక్షుడు  వీవీఎస్ లక్ష్మణ్ .. ఆమె దగ్గర వివరణ తీసుకోనున్నారు. బీసీసీఐ  సెక్రటరీ జై షా  ఈ విషయాన్ని వెల్లడించారు. 


మూడో వన్డేలో భాగంగా..  226 పరుగుల ఛేదనలో భారత సారథి  హర్మన్‌ప్రీత్‌ను అంపైర్ ఎల్బీగా ప్రకటించండంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.  బ్యాట్‌తో వికెట్లను పడగొట్టడమే గాక  డగౌట్‌కు వెళ్తూ   అంపైర్‌కు అభ్యంతరకర సంజ్ఞలు చేసింది. మ్యాచ్ ముగిశాక వారిపై  తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.  ఫోటో సెషన్‌లో కూడా   బంగ్లా ప్లేయర్లను అవమానించేలా వ్యవహరించింది. దీంతో  అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ).. ఆమె మ్యాచ్ ఫీజులో  75 శాతం కోత విధించడమే గాక  రెండు మ్యాచ్‌ల నిషేధం కూడా విధించింది. 


అయితే హర్మన్‌ వ్యవహారంపై  ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెపై కఠినంగా చర్యలు తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్లు కూడా కోరారు.  ఐసీసీ నిషేధం కూడా విధించిన నేపథ్యంలో జై షా  స్పందించారు.  ‘రోజర్ బిన్నీ, వీవీఎస్ లక్ష్మణ్ త్వరలోనే  హర్మన్‌ప్రీత్ నుంచి వివరణ తీసుకోనున్నారు.  ఆమె అలా ఎందుకు  వ్యవహరించాల్సి వచ్చిందో వివరణ కోరతారు..’అని తెలిపాడు.  కాగా  హర్మన్‌పై విధించిన రెండు మ్యాచ్‌ల నిషేధం నిర్ణయంపై అప్పీల్ చేయకూడదని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తున్నది.  ఆసియా క్రీడల నేపథ్యంలో బీసీసీఐ.. ఐసీసీ నిర్ణయంపై అప్పీల్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ హర్మన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతుండగా  అప్పీల్‌‌కు వెళ్తే అది  మొదటికే మోసం వస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 


 






అక్కడ ఉండి ప్రయోజనం లేదనిపించింది : బంగ్లా కెప్టెన్


ఈ వ్యవహారంపై  బంగ్లాదేశ్ కెప్టెన్ నైగర్ సుల్తానా మాట్లాడుతూ.. ‘మేం భారత జట్టు నుంచి  ప్రశంసలు దక్కుతాయని అనుకున్నాం. అది మా ప్లేయర్లకు మంచి  ప్రోత్సాహకంగా ఉండేది.  కానీ  వాళ్లు (ఇండియన్ టీమ్) చేసింది  మాత్రం   బాగోలేదు. ఫోటో సెషన్  కోసం మేమంతా నిల్చున్నప్పుడు అలా మాట్లాడటం సరికాదు. వారికి ఏమైనా సమస్యలు ఉంటే అంపైర్లపై మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదుచేయాలి.   మాకు  అక్కడ (ఫోటో సెషన్) గౌరవం లేదు. అలాంటప్పుడు అక్కడ ఉండటం  కరెక్ట్ కాదనిపించింది.  అందుకే అక్కడ్నుంచి వెళ్లిపోయాం’అని తెలిపింది. 








ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial