Indian Cricket Team: టెస్టు సిరీస్ మాదిరిగానే వన్డే సిరీస్‌ను కూడా  వెస్టిండీస్ ఓటమితోనే మొదలుపెట్టింది.  స్వదేశంలో భారత్‌తో జరుగుతున్న  వన్డే సిరీస్‌లో భాగంగా గురువారం బ్రిడ్జ్‌టౌన్  (బార్బడోస్) వేదికగా  జరిగిన తొలి  వన్డేలో  బ్యాటింగ్‌లో విఫలమై దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో భారత లెఫ్టార్మ్ స్పిన్ ధ్వయం  రవీంద్ర జడేజా - కుల్దీప్ యాదవ్‌ల ధాటికి విండీస్  114 పరుగులకే కుప్పకూలింది.  ఈ క్రమంలో జడ్డూ - కుల్దీప్‌లు  అరుదైన ఘనతను సాధించారు.  


నిన్నటి మ్యాచ్‌లో జడ్డూ మూడు వికెట్లు తీయగా కుల్దీప్ నాలుగు వికెట్లతో చెలరేగాడు.  ఈ ఇద్దరూ కలిసి  ఏడు వికెట్లు పడగొట్టారు.  వన్డే  క్రికెట్ చరిత్రలో  లెఫ్టార్మ్ స్పిన్ ధ్వయం  ఒక మ్యాచ్‌లో ఏడు వికెట్లు పడగొట్టడం ఇదే  ప్రథమం.  బీసీసీఐ  ఓ ప్రత్యేక ట్వీట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.  ఈ ఒక్కటే గాక నిన్నటి మ్యాచ్‌‌లో జడేజా,  కుల్దీప్, భారత జట్టు పలు రికార్డులను నమోదుచేసింది.  అవేంటంటే.. 


 






- వెస్టిండీస్‌పై వన్డేలలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో  జడ్డూ.. కపిల్ దేవ్‌ను దాటేశాడు. వన్డేలలో  కపిల్ దేవ్.. 43 వికెట్లు తీయగా.. తాజాగా మొదటి వన్డేలో మూడు వికెట్లు తీయడం ద్వారా  జడ్డూ వికెట్ల సంఖ్య 44కు చేరింది.  


- విండీస్‌లో ఒక భారత బౌలర్ అత్యుత్తమ ప్రదర్శనను కుల్దీప్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌‌లో కుల్దీప్.. 3 ఓవర్లు వేసి  రెండు మెయిడిన్లు చేసి  ఆరు పరుగులే ఇచ్చి  నాలుగు వికెట్లు (4-6) పడగొట్టాడు. అంతకుముందు భువనేశ్వర్.. 2013లో  పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా  శ్రీలంకపై  నాలుగు వికెట్లు (4-8) తీసి  8 పరుగులిచ్చాడు.


- భారత్‌పై వెస్టిండీస్‌కు వారి స్వదేశంలో వన్డేలలో ఇదే అత్యల్ప స్కోరు (114). 1997లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ 121 పరుగులకే ఆలౌట్ అవడమే ఇప్పటివరకూ లోయెస్ట్ స్కోరు. మొత్తంగా భారత్‌తో విండీస్ అత్యల్ప స్కోరు  104గా ఉంది.  2018లో తిరువనంతపురం వేదికగా జరిగిన వన్డేలో  వెస్టిండీస్ అత్యల్ప స్కోరును నమోదుచేసింది. 


ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు విండీస్‌ను 23 ఓవర్లలో  114 పరుగులకే ఆలౌట్ చేసింది.  కెప్టెన్ షై హోప్ (43) టాప్ స్కోరర్.  స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా  భారత్ తడబడింది.   22.5 ఓవర్లలో  ఐదు వికెట్లు కోల్పోయి  118 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ (52) అర్థ సెంచరీతో రాణించగా .. జడేజా (16 నాటౌట్), రోహిత్ శర్మ (12 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా విజయాన్ని ఖాయం చేశారు.  గిల్ (7), సూర్య  (19) మరోసారి విఫలమయ్యారు.  






ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial