Axar Patel the Jayasuriya of Nadiad: చిన్నప్పుడు స్పిన్ బౌలింగ్ చేయాలంటే విముఖత చూపినవాడు... భారత్‌కు ప్రపంచకప్ అందించాడు. బంతిని బలంగా కొట్టడాన్ని ఇష్టపడిన వాడు.. ఇప్పుడు అదే ఊపుతో బంతిని బాది టీ 20 ప్రపంచకప్‌ను గెలిపించాడు. చిన్నతనంలో తల్లి, అమ్మమ్మ క్రికెట్ ఆడటానికి అభ్యంతరం చెప్తే దొంగచాటుగా క్రికెట్ ఆడిన వాడు... ఇప్పుడు అదే క్రికెట్‌తో తన పేరు మార్మోగేలా చేశాడు. అతనే అక్షర్ పటేల్(Axar Patel). బక్క పలుచగా ఉన్న అక్షర్... ఇప్పుడు టీమిండియాలో అసలైన ఆల్‌రౌండర్. అక్షర్ పటేల్‌కు టీ 20 ప్రపంచకప్‌లో చోటు దక్కినప్పుడు అన్నీ విమర్శలే. వాషింగ్టన్ సుందర్-అక్షర్ పటేల్‌లో ఎవరిని జట్టులోకి తీసుకోవాలా అనే విషయంలో భారత సెలెక్టర్ల మధ్య తీవ్ర చర్చోపచర్చలు జరిగాయి. చివరికి అక్షర్‌కు చోటు దక్కింది.
ఆల్‌రౌండర్ కోటాలో జట్టులో చోటు దక్కించుకున్న అక్షర్... అదే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియాకు ప్రపంచకప్ అందించాడు. ప్రపంచ కప్ ఫైనల్‌లో టాప్ ప్లేయర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, పంత్ అవుటై తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు... విరాట్ వికెట్ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న వేళ.. అక్షర్ అద్భుతం చేశాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన కగిసో రబడా బౌలింగ్‌లో అక్షర్ కొట్టిన సిక్స్ అయితే అతని ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. విపరీతమైన ఒత్తిడిలో ప్రపంచకప్ ఫైనల్లో ఎదురుదాడికి దిగి భారత్‌కు గెలుస్తామన్న ఆత్మ విశ్వాసాన్ని అందించిన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్.
అక్షర్‌కు ఎన్ని ముద్దు పేర్లో...
టీమిండియా క్రికెట్‌లో అక్షర్‌ను బాపు అనే ముద్దుపేరుతో పిలుస్తారు. అక్షర్‌కు ఇంకో ముద్దు పేరు కూడా ఉంది. ఆ పేరే నాడియాడ్ ఆఫ్ జయసూర్య. రిషభ్ పంత్ అప్పుడప్పుడు స్టంప్స్ వెనక నుంచి జయసూర్య అని పిలుస్తుండడం వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ జయసూర్యానే టీమిండియాకు పొట్టి ప్రపంచకప్ అందించాడు. ఈ ప్రపంచకప్ ఫైనల్లో అక్షర్ ఆట... 1996 సెమీస్‌లో అరవింద డి సిల్వా ఆటను గుర్తు చేసింది. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో యువరాజ్ కంటే బ్యాటింగ్‌లో ధోనీ ముందు వచ్చినట్లు.... ఈ ప్రపంచకప్‌లో శివమ్ దూబే కంటే ముందు అక్షర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. జయసూర్యలాగే అక్షర్ కూడా బంతిని చాలా బలంగా కొడతాడు.
బాపులానే ప్రశాంతంగా...
బాపు ప్రశాంతంగా ఉంటూ భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని ముందుకు నడిపిస్తే.. ఈ బాపు చాలా ప్రశాంతంగా టీమిండియాను ప్రపంచకప్ వైపు నడిపించాడని ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. తీవ్ర ఒత్తిడిలోనూ చాలా ప్రశాంతంగా బ్యాటింగ్ చేశాడు. 34 పరుగులకే భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయిన క్లిష్టమైన దశలో ప్రమోషన్ మీద ముందే బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్... కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కొహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 31 బాల్స్ లో 1 ఫోరు, 4 భారీ సిక్సర్లతో 47పరుగులు చేశాడు. తర్వాత బౌలింగ్ లోనూ కీలక మైన ట్రిస్టన్ స్ట్రబ్ వికెట్ తీసి సత్తా చాటాడు. ఇంగ్లండ్ తో జరిగిన సెమీస్ లోనూ కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్ ను దెబ్బ కొట్టాడు. సెమీస్‌లో బాల్‌తో రాణించిన అక్షర్..ఫైనల్లో బ్యాట్‌తో చెలరేగి టీమిండియా వరల్డ్ కప్ అందుకునేలా చేశాడు.