AUSW vs INDW 5TH T20:  ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20లోనూ భారత అమ్మాయిలకు నిరాశే మిగిలింది. చివరిదైన ఐదో టీ20లో ఆస్ట్రేలియా చేతిలో 54 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్ ను ఆసీసీ 4-1 తో గెలుచుకుంది. 


బౌలింగ్ వైఫల్యం


టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచులోనూ ముందుగా బౌలింగ్ చేసి ఓడిపోయినప్పటికీ మళ్లీ ఫీల్డింగ్ తీసుకోవడం గమనార్హం. బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆసీస్ ను మొదట భారత బౌలర్లు బాగానే కట్టడి చేశారు. కట్టుదిట్టమైన బంతులతో పరుగులు కట్టడి చేయటంతో పాటు వికెట్లు పడగొట్టారు. 17 పరుగులకే ఓపెనర్లద్దరినీ పెవిలియన్ పంపారు. మూనీ (2)ని శర్వానీ ఔట్ చేయగా... లిచ్ ఫీల్డ్ (11) ను దీప్తి శర్మ పడగొట్టింది.  తర్వాత మెక్ గ్రాత్ (26), పెర్రీ (18)లు ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. మళ్లీ పుంజుకున్న టీమిండియా బౌలర్లు వారిద్దరీనీ వెంటవెంటనే ఔట్ చేశారు. అయితే ఆ తర్వాతే ఆస్ట్రేలియా బ్యాటర్ల మోత మొదలైంది. గార్డెనర్ (66), హారిస్ (64) లు ఉతకడమే పనిగా పెట్టుకున్నారు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకి తరలించారు. వీరి ధాటికి భారత బౌలర్లు గాడితప్పారు. చివరికి ఆస్ట్రేలియా మరో వికెట్ కోల్పోకుండానే 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. 


కుప్పకూలిన బ్యాటర్లు


భారీ లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు తేలిపోయారు. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (4) మరోసారి విఫలమైంది. తొలి ఓవర్లోనే ఆమె ఔటయ్యింది. ఆ తర్వాత షెఫాలీ వర్మ (14), హర్లీన్ డియోల్ (24) ఇన్నింగ్స్ ను కొంచెం చక్కదిద్దారు. అయినప్పటికీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన భారత్ 54 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీప్తి శర్మ (53) అర్ధశతకంతో మెరిసింది. హర్మన్ ప్రీత్ కౌర్ (12), దేవికా వైద్య (11), రిచా ఘోష్ (10) లు విఫలమయ్యారు. దీంతో 142 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 


ఈ ఓటమితో టీమిండియా 1-4 తేడాతో ఆస్ట్రేలియాకు సిరీస్ ను కోల్పోయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను యాష్లే గార్డెనర్ దక్కించుకుంది.