IPL Auction 2023: ఐపీఎల్ మినీ వేలానికి ఇంకా 3 రోజుల సమయమే ఉంది. డిసెంబర్ 23న కొచ్చిలో ఈ వేలం జరగనుంది. ఇప్పటికే జట్లు తాము కొనుగోలు చేయాలనుకున్న ఆటగాళ్ల లిస్టును తయారుచేసుకుంటున్నాయి. అలాగే వేలంలో ఎలాంటి వ్యూహాలు రచించాలి, ఎటువంటి ఆటగాళ్లను తీసుకోవాలి అనే దానిపై కసరత్తులు చేస్తున్నాయి. మొత్తం 10 ఫ్రాంచైజీలు తమకు కావల్సిన ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. వద్దు అనుకున్న వాళ్లను విడుదల చేశాయి. కాబట్టి వేలంలో వందలమంది ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. వారిలో కొందరు స్టార్ ఆటగాళ్లు కూడా ఉన్నారు.
కెప్టెన్ వేటలో హైదరాబాద్
ప్రస్తుతం ఫ్రాంచైజీల్లో కెప్టెన్ అవసరం ఉన్న జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. ఈసారి సన్ రైజర్స్ జట్టు తన కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను రిటైన్ చేసుకోలేదు. కాబట్టి ఆ జట్టుకు ఇప్పుడు నాయకుడి అవసరం ఉంది. వేలంలో ఒక మంచి ఆటగాడిని కొనుగోలు చేసి అతనికి సారథ్య బాధ్యతలు అప్పగించాలనుకుంటోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి కెప్టెన్ గురించి ఒక సలహా ఇచ్చాడు. వేలంలో మయాంక్ అగర్వాల్ ను దక్కించుకుని అతనికి కెప్టెన్సీ ఇవ్వాలని సన్ రైజర్స్ కు సూచించాడు.
'మయాంక్ అగర్వాల్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు మంచి ఆప్షన్. టాపార్డర్ లో ఎక్కడైనా ఆడగలడు, ఓపెనింగ్ చేయగలడు. అలాగే జట్టును నడిపించగల అనుభవం ఉంది.' అని పఠాన్ అన్నాడు. మయాంక్ అగర్వాల్ కు ఇన్నింగ్స్ ను ప్రారంభించడంలో ఎంతో అనుభవం ఉందని పఠాన్ పేర్కొన్నాడు. 'ప్రస్తుతం హైదరాబాద్ జట్టుకు ఇప్పుడు ఒక మంచి ఓపెనర్, అలాగే కెప్టెన్ అవసరం ఉంది. మయాంక్ వారికి చక్కని ప్రత్యామ్నాయం. అగర్వాల్ చాలా నిర్భయంగా, నిస్వార్ధంగా, దూకుడుగా ఆడతాడు. కాబట్టి అతన్ని వేలంలో కొనుగోలు చేస్తే సన్ రైజర్స్ కు అన్ని విధాలుగా ఉపయోగపడతాడు.' అని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.
గత కొన్ని సీజన్ల నుంచి పంజాబ్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహించిన మయాంక్ అగర్వాల్ ఆ ఫ్రాంచైజీ ఇప్పుడు వదులుకుంది. అతని స్థానంలో శిఖర్ ధావన్ ను కెప్టెన్ గా నియమించింది. పంజాబ్ కంటే ముందు మయాంక్... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్, రైజింగ్ పుణె జెయింట్స్ జట్లకు ఆడాడు.
కొచ్చిలో ఈనెల 23న 2.30 గంటలకు మినీ వేలం ప్రారంభం కానుంది. రేపు ఫ్రాంచైజీ యజమానులందరూ కొచ్చికి చేరుకుంటారని సమాచారం. ఈ వేలంలో 273 మంది భారత ఆటగాళ్లు, 132 మంది విదేశీ ప్లేయర్లు పాల్గొననున్నారు. మొత్తం 87 స్లాట్ ల కోసం 405 మంది బరిలో ఉన్నారు.