IND vs BAN 2nd Test:


అనుకున్నదే జరిగింది! బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అందుబాటులో ఉండటం లేదు. అతడితో పాటు యువ పేసర్‌ నవదీప్‌ సైనీ సైతం దూరమయ్యాడు. డిసెంబర్‌ 22న మీర్పూర్‌ వేదికగా రెండో టెస్టు జరగనుంది. ఇప్పటికీ సిరీసులో టీమ్‌ఇండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. జట్టులో మార్పుల గురించి మంగళవారం బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.


చేతి వేళ్లకు గాయం


బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో రోహిత్‌ శర్మ గాయపడ్డాడు. స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా అతడి చేతి వేళ్లకు బంతి తగిలింది. రక్తం కారడంతో వెంటనే అతడిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఢాకాలోని ఆస్పత్రిలో స్కానింగ్‌ చేయించారు. ఆ తర్వాత ముంబయికి పంపించి ప్రత్యేక నిపుణులతో చికిత్స అందించారు. ఎముక పక్కకు తొలగడంతో చికిత్స చేసిన వైద్యులు కుట్లు వేశారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. మున్ముందు మరింత క్రికెట్‌ ఆడాల్సి ఉండటంతో ముందు జాగ్రత్తగా అతడికి ఎక్కువ విశ్రాంతి ఇస్తున్నారు. వచ్చే వారం వైద్య పరీక్షల తర్వాత నిర్ణయం తీసుకుంటారు.




సైనికి కడుపు నొప్పి!


యువ పేసర్‌ నవదీప్‌ సైని బెంగళూరులోని ఎన్‌సీఏకు వెళ్తాడని బీసీసీఐ వెల్లడించింది. కడుపు కండరాల్లో నొప్పి రావడంతో మ్యాచ్‌ నుంచి తప్పించింది. ఎన్‌సీఏలో వైద్య నిపుణుల బృందం అతడిని పర్యవేక్షిస్తుందని తెలిపింది. టీమ్‌ఇండియా ఇప్పటికే ఇద్దరు సీనియర్‌ పేసర్ల సేవలను కోల్పోయింది. వెన్నెముక నొప్పితో జస్ప్రీత్‌ బుమ్రా దూరమయ్యాడు. భుజం గాయంతో మహ్మద్‌ షమీ అందుబాటులో లేడు. ఇప్పుడు సైని సైతం గాయపడటంతో బోర్డు కలవర పడుతోంది. మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్ యాదవ్‌ పైనే భారం వేయనుంది. మూడో పేసర్‌గా జయదేవ్‌ ఉనద్కత్‌, శార్దూల్‌ ఠాకూర్‌ అందుబాటులో ఉన్నారు.


బిజీ షెడ్యూలు


జనవరిలో టీమ్‌ఇండియా షెడ్యూలు బిజీగా ఉంది. స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్‌తో చెరో మూడు వన్డే, మూడు టీ20లు ఆడనుంది. త్వరలోనే జట్టును ప్రకటిస్తారు. ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియా పర్యటన మొదలవుతుంది. 9వ తేదీ నుంచి నాలుగు టెస్టుల సిరీస్‌ ఆరంభమవుతుంది. ఆ లోగా కొత్త సెలక్షన్‌ కమిటీ ఎంపిక జరుగుతుందో లేదో తెలియడం లేదు.


భారత జట్టు


రెండో టెస్టుకు భారత జట్టు: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్ పంత్‌, కేఎస్‌ భరత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్ యాదవ్‌, అభిమన్యు ఈశ్వరన్‌, సౌరభ్‌ కుమార్‌, జయదేశ్ ఉనద్కత్‌