ENG Vs PAK 3rd Test: సొంత గడ్డపై ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో పాకిస్థాన్ పరాజయం పరిపూర్ణమైంది. మొత్తం 3 టెస్టుల్లోనూ ఇంగ్లిష్ జట్టు చేతిలో పాక్ ఓడిపోయింది. ఈ రోజు ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్ ల సిరీస్ ను క్వీన్ స్వీప్ చేసింది.
పాకిస్థాన్ పై మూడో టెస్టులో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇంగ్లండ్ 3-0 తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. నాలుగో రోజు విజయానికి అవసరమైన 55 పరుగులను సాధించి గెలుపొందింది. నాలుగో రోజు 2 వికెట్లకు 112 పరుగులతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ కు బెన్ డకెట్ (82), బెన్ స్టోక్స్ (35) మరో వికెట్ పడకుండా విజయాన్ని అందించారు. ఈ పరాజయంతో ఇంగ్లిష్ జట్టు చేతిలో పాకిస్థాన్ వైట్ వాష్ కు గురైంది
మ్యాచ్ వివరాలు
మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ తొలి ఇన్నింగ్సులో 304 పరుగులకు ఆలౌటైంది. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ (78), అఘా సల్మాన్ (56) అర్ధసెంచరీలు సాధించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టగా, రెహాన్ అహ్మద్ 2 వికెట్లతో రాణించాడు. బదులుగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 354 పరుగులకు ఆలౌటైంది. హారీ బ్రూక్ (111) శతకంతో చెలరేగగా.. ఫోక్స్ (64) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్, నౌమన్ అలీలు చెరో 4 వికెట్లు తీశారు.
తొలి ఇన్నింగ్సు లో 50 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ను రెహాన్ అహ్మద్ హడలెత్తించాడు. 5 వికెట్లతో ఆ జట్టు పతనాన్ని శాసించాడు. అతడితో పాటు జాక్ లీచ్ 3 వికెట్లతో రాణించటంతో పాక్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. బాబర్ మరోసారి (54) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. సౌద్ షకీల్ (53) రాణించాడు. 166 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు ఓపెనర్లు జాక్ క్రాలీ (41), బెన్ డకెట్ లు 11.3 ఓవర్లలోనే 87 పరుగులు జోడించి విజయానికి గట్టి పునాది వేశారు. అయితే పాక్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ క్రాలీతో పాటు నైట్ వాచ్ మన్ రెహాన్ అహ్మద్ (10) ను ఔట్ చేయటంతో ఇంగ్లండ్ జోరు కాస్త నెమ్మదించింది. ఆట నాలుగో రోజు వరకు వచ్చింది. ఈరోజు బెన్ డకెట్, బెన్ స్టోక్స్ లు లాంఛనాన్ని పూర్తి చేసి జట్టుకు విజయాన్ని అందించారు.
పాకిస్థాన్ తన సొంతగడ్డపై టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ కు గురవడం ఇదే తొలిసారి.