BCCI Apex Council Meeting: రేపు (డిసెంబర్ 21) బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇది బీసీసీఐ ఛైర్మన్ రోజర్ బిన్నీ అధ్యక్షతన జరగనుంది. ఇందులో భారత ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలు పాల్గొననున్నారు. ఈ మీటింగ్ లో టీమిండియా క్రికెట్ గురించి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
టీమిండియా ఇటీవల ప్రదర్శనలపై బీసీసీఐ సంతృప్తిగా లేదు. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ లలో ఓటమి, బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ కోల్పోవడం వంటి వాటిపై బీసీసీఐ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. భారత క్రికెట్ సహాయక సిబ్బంది విషయంలోనూ సంతోషంగా లేదని తెలుస్తోంది. అందుకే రేపు జరిగే అపెక్స్ సమావేశంలో వీటిపై చర్చించనున్నారు. అలానే ఈ మీటింగ్ లో భారత క్రికెట్ గురించి ప్రధాన నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా స్ల్పిట్ కెప్టెన్సీ, స్ల్పిట్ కోచ్ (ఒక్కో ఫార్మాట్ కు ఒక్కో కోచ్, ఒక్కో కెప్టెన్) విధానం అమలుచేసే విషయాన్ని చర్చించనున్నారు. అలాగే కొత్త సెలక్షన్ కమిటీనీ ఎంపిక చేయనున్నారు.
అపెక్స్ సమావేశం అజెండాలోని ముఖ్యాంశాలు
- స్ల్పిట్ కోచింగ్ (టీ20 జట్టుకు ప్రత్యేక కోచ్)
- స్ల్పిట్ కెప్టెన్సీ (టీ20లకు హార్దిక్ పాండ్యను కెప్టెన్ ను చేయవచ్చు)
- ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఓటమిపై సమీక్ష
- ప్రస్తుత కోచ్ లు, సహాయక సిబ్బంది పనితీరుపై సమీక్ష
- సెలక్షన్ కమిటీ రొటేషన్ విధానంపై చర్చ.
టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్య!
వచ్చే ఏడాది ఏప్రిల్ కు రోహిత్ శర్మకు 36 ఏళ్లు నిండుతాయి. కాబట్టి అతడు ఇంకా ఎన్నేళ్లు ఆడతాడనేది ప్రశ్నర్ధకమే. కాబట్టి టీ20లకు భవిష్యత్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యను చేయాలని బీసీసీఐ భావిస్తోంది. అలాగే స్ల్పిట్ కోచింగ్ గురించి ముఖ్యమైన చర్చ జరగనుంది. టీ20ల్లో ఆశించిన ఫలితాలు రాకపోవటంతో కోచింగ్ ను విభజించే యోచనలో బీసీసీఐ ఉంది. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ వన్డే, టెస్ట్ కోచ్ గా కొనసాగనుండగా.. టీ20 లకు వేరే కోచ్ వచ్చే అవకాశం ఉంది.
అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అజెండా
- ఆటగాళ్లకు కొత్త కాంట్రాక్టులపై చర్చ, నిర్ణయం.
- కొత్త సెలక్షన్ కమిటీ నియామకంపై ఆమోదం.
- బీసీసీఐ ప్రధాన స్పాన్సర్లైన బైజూస్, ఎంపీఎల్ ప్రస్తుతం స్టేటస్ గురించి చర్చ.
- కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్ట్నన్ నియామకం.
- ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సబ్ కమిటీ ఏర్పాటు. 5 వేదికల అప్ గ్రేడేషన్ పై చర్చ.
- శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ వేదికలపై చర్చ.
- ఆసీస్- భారత్ పింక్ బాల్ టెస్టుపై చర్చ.
- టీ20 ప్రపంచకప్ వైఫల్యంపై సమీక్ష.
- సహాయక సిబ్బంది మేనేజ్ మెంట్ పై చర్చ.
'మేం పదేపదే ఓడిపోవాలనుకోవడం లేదు. ఇకపై ఎలాంటి ఛాన్స్ తీసుకోం. మేం ఇప్పటికే రోహిత్ శర్మతో చర్చించాం. టీ20 ఫార్మాట్ కు కొత్త కెప్టెన్ ను నియమించే విషయంలో అతనికి ఎలాంటి ఇబ్బందిలేదు. రాహుల్ తోనూ చర్చిస్తాం. అతను నిస్సందేహంగా భారత జట్టుకు ఒక ఆస్తి. అయితే వర్క్ లోడ్ ఎక్కువ ఉంది. మేం అతని భారాన్ని తగ్గించాలనుకుంటున్నాం.' అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పినట్లు సమాచారం.