AUSW VS INDW 2nd T20:  ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత అమ్మాయిలు అద్భుత విజయం సాధించారు. సూపర్ ఓవర్ కు దారితీసిన ఈ మ్యాచులో టీమిండియా 4 పరుగులతో విజయం సాధించింది. 


టాస్ గెలిచిన టీమిండియా ఆస్ట్రేలియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అయితే అది తప్పు నిర్ణయమని త్వరగానే అర్ధమైంది. ఆసీస్ ఓపెనర్లు హేలీ, మూనీ దూకుడుగా ఆడారు. 3.3 ఓవర్లలోనే స్కోరూ 29కి చేరింది. అయితే హేలీని దీప్తి శర్మ ఔట్ చేయటంతో భారత్ కు తొలి వికెట్ దక్కింది. అయితే ఆ ఇన్నింగ్సులో టీమిండియా సంతోషపడ్డ సందర్భం అదే. టీమిండియాకు దక్కిన మొదటి, చివరి వికెట్ అదే. ఆ తర్వాత ఆస్ట్రేలియా అమ్మాయిలు ఇంకో వికెట్ నష్టపోకుండా 20 ఓవర్లలో 187 పరుగుల భారీ స్కోరు చేశారు. మూనీ, మెక్ గ్రాత్ లు విజృంభించి ఆడారు. భారత బౌలర్లను నిస్సహాయులను చేస్తూ చెలరేగారు. మూనీ (54 బంతుల్లో 82), హేలీ (51 బంతుల్లో 70)లు రెండో వికెట్ కు అజేయంగా 158 పరుగులు చేశారు. 


దూకుడుగా లక్ష్య ఛేదన


భారత అమ్మాయిలు కూడా లక్ష్య ఛేదనను దూకుడుగానే ఆరంభించారు. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధానలు తొలి వికెట్ కు 8.4 ఓవర్లలో 76 పరుగులు జోడించారు. అయితే వెంటవెంటనే షెఫాలీ (34), జెమీమా రోడ్రిగ్స్ (4)లు ఔటయ్యారు. ఆ తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ అండతో స్మృతి మంధాన చెలరేగి ఆడింది. ఓవైపు హర్మన్ స్ట్రైక్ రొటేట్ చేస్తుండగా.. స్మృతి అలవోకగా బౌండరీలు, సిక్సులు కొట్టింది. ఈ క్రమంలోనే 49 బంతుల్లో 79 పరుగులు చేసి సూధర్ లాండ్ బౌలింగ్ లో ఔటయ్యింది. అంతకుముందే హర్మన్ కూడా (22) ఔటయ్యింది. దీంతో భారత్ 17 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. అప్పటికి గెలుపు సమీకరణం 21 బంతుల్లో 39గా ఉంది. ఈ దశలో రిచా ఘోష్ భారీ షాట్లతో భారత్ ను లక్ష్య ఛేదన వైపు నడిపించింది. చివరి ఓవర్లో విజయానికి 14 పరుగులు అవసరం కాగా దేవికా వైద్య (11), రిచా ఘోష్ (26) అద్భుతంగా ఆడి 13 పరుగులు రాబట్టారు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది.






సూపర్ ఓవర్ సాగిందిలా..


సూపర్ ఓవర్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 6 బంతుల్లో 20 పరుగులు చేసింది. రిచా ఘోష్ మొదటి బంతిని స్టాండ్స్ లో పడేసింది. అయితే తర్వాతి బంతికే ఔటయ్యింది. ఆ తర్వాత బంతికి హర్మన్ సింగిల్ తీయగా స్మృతి మంధాన స్ట్రైకింగ్ కు వచ్చింది. నాలుగో బంతిని బౌండరీకి తరలించిన మంధాన, ఐదో బంతిని సిక్స్ గా మలిచింది. ఆరో బంతిని బలంగా కొట్టగా ఆసీస్ ఫీల్డర్ మూనీ అద్భుతమైన ఫీల్డింగ్ తో 3 పరుగులే వచ్చాయి. దీంతో 6 బంతుల్లో టీమిండియా 20 పరుగులు చేసింది. 


21 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది ఆస్ట్రేలియా. భారత తరఫున రేణుకా సింగ్ ఠాకూర్ బౌలింగ్ చేసింది. మొదటి బంతినే హేలీ బౌండరీకి పంపింది. రెండో బంతికి రనాట్ మిస్ కాగా ఒక పరుగు వచ్చింది. మూడో బంతికి రాధ పట్టిన సూపర్ క్యాచ్ కు గార్డెనర్ ఔటయ్యింది. నాలుగో బంతికి ఒక పరుగు వచ్చింది. అయితే 5, 6 బంతులను హేలీ బౌండరీ, సిక్సులుగా కొట్టడంతో ఆసీస్ 16 పరుగులు చేసింది. 


దీంతో టీమిండియా అమ్మాయిలు 4 పరుగుల తేడాతో విజయం సాధించారు. మొదటి టీ20 మ్యాచులో ఆసీసీ అమ్మాయిలు విజయం సాధించారు. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచుకు సుమారు 47వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు.